ప్రమోద్ ఆవంచ కవిత : మార్చురీ
ఎర్ర బడిన కళ్ళల్లో మసిలే కన్నీళ్లు కలలను చిధ్రం చేసే చావు నీడలు అంటూ ప్రమోద్ ఆవంచ రాసిన కవిత ' మార్చురీ......' ఇక్కడ చదవండి :
కాటికాపరి లేని స్మశానంలో
నిరంతరం శవాల యాత్ర
మృత దేహాల డిసెక్షన్ హౌస్
చనిపోయిన దేహాలను ముక్కలు
చేయడమే అక్కడి తంతు
ఆత్మలు ఘోషిస్తుంటాయి
ఆ స్థలమంతా దుర్గంధాల కాక
శ్వాస ఆడక గిల గిల కొట్టుకునే
ముక్కుపుటాల కేక
ఎక్కడో రోడ్డుపై పారిన నెత్తుటి మరకలు కనబడకుండా
తెల్ల బట్టలు కప్పే కళేబరం అది
దిక్కు తోచని మస్తిష్కం వేదనల పర్యంతం
ఎర్ర బడిన కళ్ళల్లో మసిలే కన్నీళ్లు
కలలను చిధ్రం చేసే చావు నీడలు
దగ్గరి నుంచి చూస్తే తట్టుకోలేని బంధానికి
కళ్ళతోనే కన్నీటి వీడ్కోలు
జననాలకు కొదవ లేదు
అలాగే మరణాలకు అంతే లేదు
సృష్టి జరుగుతూనే ఉంటుంది ప్రకృతి సాక్షిగా
కాల ప్రవాహంలో కొట్టుకుపోయే కన్నీళ్లు
జ్ఞాపకాల అడుగులై మస్తిష్కాన్ని చేరాయి
చీకటి వీడని ఎన్నో సుధీర్ఘ సమయాలు
ఆ మార్చురీ భవనం నీడన మరుగున పడుతున్నాయి....