Asianet News TeluguAsianet News Telugu

పొట్లపల్లి శ్రీనివాసరావు కవిత: కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు

వరంగల్లుకు చెందిన ప్రముఖ కవి పొట్లపల్లి శ్రీనివాస రావు రాసిన కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాలు కవితను ఇక్కడ ఇస్తున్నాం, చదవండి.

Potlapalli Srinivas Rao Telugu poem, Telugu Literature
Author
Warangal, First Published May 22, 2021, 4:56 PM IST

పిడికెడు మట్టి చాలు దోసెడు నీళ్ళు చాలు
విత్తనం  మొక్కై మొగ్గ తొడిగి హరి తి౦చడానికి
వయసు ఏదైనా వాత్సల్య పు లాలనే  జీవితం
కాదంటావా పొట్లపల్లి ఇదే కదా మానవ జీవనం

పుట్టి ఏడుస్తాం చచ్చి ఏడిపిస్తాం
చావు పుట్టుకల మధ్య ఉత్తుత్తి బొమ్మలం
ఊపిరి ఆగినా బతికితేనే జీవితం
కాదంటావా పొట్లపల్లి ఇదే కదా మానవ జీవనం

నవమాసాలు మోస్తం  కంటికి రెప్పలా చూస్తాం
కలల సౌధం కోసం బరువు ఎంతైనా భరిస్తాం
మాయ మర్మాల లోకం భ్రమల  జీవితం
కాదంటావా పొట్లపల్లి ఇదే కదా మానవ జీవనం

కులాల కొట్లాట లో నాయకులం అవుతాం
మతాల చిచ్చుకు కార్యోన్ముఖులం అవుతాం
బతుకు లేదు ఇప్పుడిక రంగుల ఉనికే జీవితం
కాదంటావా పొట్లపల్లి ఇదే కదా మానవ జీవనం

దిన ఫలాలు వార ఫలాలు తనివి తీరా చూస్తుంటాం
వత్సరానికొకసారి పంచాంగాలు అదేపనిగా వింటాం
తక్షణమే అన్నీ మరిచిపోయి టాటా అంటేనె జీవితం
కాదంటావా పొట్లపల్లి  ఇదే కదా మానవ జీవనం

నానా గడ్డి కరిచి పేరుకోసం పాకులాడుతాం
పరాయి కిరాయి బృందంతో పత్రికల్లో ప్రకటన లిస్తాం
ఏనాడైనా సామాన్యుడిని గురికొట్టే వాడిదె జీవితం
కాదంటావా పొట్లపల్లి ఇదే కదా మానవ జీవనం

చదువులు ఎన్నో చదివి పదవులు ఎన్నో వరించాం
పట్నం మర్మమేరిగి పల్లె రుచులు మరిచాం
 ఉన్నూరుని వదిలి కన్నవారిని కాదంటే నే జీవితం
కాదంటావా పొట్లపల్లి ఇదే కదా మానవ జీవనం

ఓడిపోవడం గెలవడం పడిపోవడం ఉత్తిదే
మోసపోవడం చెడిపోవడం అంతా తిత్తిదే
నిరంతరం అన్వేషించి నేర్చుకునె పాఠశాలే జీవితం
కాదంటావా పొట్లపల్లి ఇదే కదా మానవ జీవనం

Follow Us:
Download App:
  • android
  • ios