పొట్లపల్లి శ్రీనివాసరావు కవిత : సంభవామి కలి యుగే..
తెలుగు కవిత్వంలో వ్యంగ్యానికి ప్రత్యేక స్థానం ఉంది. పాలాభిషేకాలు నిరసించాలి అంటూ హనుమకొండ నుండి పొట్లపల్లి శ్రీనివాసరావు రాసిన ఆసక్తికరమైన వ్యంగ్య కవిత "సంభవామి కలి యుగే.." ఇక్కడ చదవండి.
వైకుంఠంలో సందడి కరువైంది
లక్ష్మీదేవి అలిగి ముక్కు మూసుకుని కూర్చున్నది
బ్యాంకు లాకర్లలో గాలి ఆడక రొప్పుతున్నది
ఇంద్రాది దేవతలంతా వైకుంఠ ద్వారం వద్ద
విష్ణుమూర్తి కోసం పడిగాపులు పడుతున్నారు
పాలసముద్రం ఎందుకు తరుగుతున్నది
సృష్టి,లయ కర్తలు స్థితి కారుడి మీద ఒత్తిడి పెంచారు
భోలాశంకరుడు భూలోకపు
ఆరోగ్య అవగాహనకు స్థాణువయ్యాడు
యమదూతలు ఒత్తిడి ఎక్కువై యముడి మీద యుద్ధం ప్రకటించారు
యమరాజు హడావిడిగా నూతన నియామకాల ప్రకటన కావించాడు
రాజ్యకాంక్షతో భువన లోకపు మోహకాంక్ష వీడిన
యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు
శుక్రాచార్యుని దీవెనలతో ప్రమధ గణాల కలుపుకొని
భూలోకపు గల్లీ గల్లీలో లొల్లి లొల్లి చేస్తూ
అధినాయకులై చెలరేగి పోతున్నారు
కలియుగ దేవుళ్ళ ప్రీత్యర్థం కరుణాకటాక్ష వీక్షణార్థం
అపర విష్ణు మూర్తుల ముందు దోసిలి ఎత్తి
సమస్త సంపదలు కైంకర్య నివేదనలు సమర్పిస్తున్నారు
భక్తి పూనకాల సమూహాల సౌకర్యం కోసం
స్నాన శౌచాది పాలాభిషేకాల ఇత్యాది ఉపచారాల కోసం
పాలసముద్రం ఇలాతలం వైపు వడివడిగావెళుతున్నది
మాసిన గడ్డంతో తీవ్ర ఆలోచనతో సంచరిస్తున్న
ఆది మధ్యాంత రహితుడిని గమనించిన లోక సంచారి
ద్వారం ముందున్న దేవతల క్రీగంట చూస్తాడు
బృహస్పతి ఆధ్వర్యంలో భువన లోకపు వాసులంతా దేవదేవుని చుట్టుముట్టి అనర్ధాన్ని వివరిస్తారు
పాలసముద్రాన్ని కాపాడి దేవలోకపు దాహం
తీర్చాలని మొరపెట్టుకున్నారు
త్రిమూర్తుల సలహాతో కలియుగ చక్రవర్తులతో
కలహభోజనుడు రాయబారం నేరుపుతాడు
సకల మానవుల పాలిస్తున్నం
యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నం
పాలసముద్రం ఏ ఒక్కరిదీ కాదు
మా సంగతి ముందుగా తేల్చమని
కలియుగాధిపతి ప్రమద గణాలతో
నారదులవారికి చెప్పించి తరిమేస్తాడు
ఇంద్రాది దేవతలు త్రిమూర్తుల సమక్షంలో
అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తారు
సంభవామి యుగేయుగే తప్పదు తప్పదు మళ్లీ
కొత్త అవతారం అని ముక్తకంఠంతో తీర్మానిస్తారు
ముక్కోటిదేవతల కన్నా రాజకీయనాయకులే మిన్నయని
స్వర్గలోకం పార్టీని స్థాపించాలనే ముసాయిదా పత్రంతో
మహావిష్ణువుకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారు
ఆనాడు భృగుమహర్షి తన్నిన తన్నుకు వైకుంఠం వదిలితి
కలియుగ శ్రీనివాసుడినై ఏడుకొండల మీద శిలనై పోతి
ఇప్పుడు ఏమి కానున్నదో ఈ అవతారంలో ఎన్ని బాధలో
స్వర్గలోకం నాయకుడు స్వర్ణ దేశం సృష్టించాలనే
కఠోర దీక్షతో భూలోకంలో కాలూనినట్లు
పాలసముద్రాన్ని రక్షించాలి
పాలాభిషేకాలు నిరసించాలి
నినాదాల హోరుతో తెల తెల్లవారంగా ఒక స్వప్నం