Asianet News TeluguAsianet News Telugu

పొట్లపల్లి శ్రీనివాసరావు కవిత : జ్ఞాపకాల జాతర

అమ్మ ఒడి లాలింపులా ఇల్లంటె ఒక పేగు బంధం అంటూ హన్మకొండ నుండి పొట్లపల్లి శ్రీనివాసరావు రాసిన  కవిత  " జ్ఞాపకాల జాతర " ఇక్కడ చదవండి : 
 

potlapalli srinivas rao telugu poem
Author
First Published Jan 7, 2023, 2:05 PM IST

పేదోడి పూరి గుడిసె
పెద్దోడి ఇంద్ర భవనం
ఎటూ కానోడి అప్పిల్లు

మట్టి ముట్టినోడికి ముట్టనోడికి
చివరాఖరి ఊపిరి కన్నా ముందే
మట్టి వాసన తెలిపే విశ్రాంత సౌధం
అందరూ తలదాచుకునే చోటు 

కూడికల తీసివేతల గుణింపుల భాగహారంలో
నిండు సున్నాకు కుడి ఎడమల ఎందరెందరో
శక్తి కొద్ది స్వప్నించి సేద తీరే తపనతో
నిర్మించుకొని నిదురించే స్వేచ్ఛా తీరం
చెమట చుక్కల పనితనంతో మెరిసే నిర్మాణం

పునాదులపై పేర్చే ఇటుక మీద ఇటుకను
ఇసుక సిమెంటు కలగలసి ఇటుక బంధంతో 
జతకలసి ఇనుమూ కంకరకూ మరింత ధైర్యాన్నిస్తూ
బ్రతికినంత కాలం  తోడైనీడై జీవించే ప్రాణ మిత్రులు

సుతిమెత్తని తీవెలతో అల్లిబిల్లిగా అల్లుకుని
పూచిన గుమ్మడి పూల అందాలు
పచ్చదనపు జాతరై లతలుా క్రోటన్లుా
మిద్దె మీద కొలువుదీరే ఆకుపచ్చని బంధాలు

కుటుంబం కుటుంబం అంతా పెనవేసుకు సాగే
ఎడతెగని వూసుల మమకారాల మధువనిలా
వారసత్వపు వాత్సల్యపు జ్ఞాపకాల కూడలి
అమ్మ ఒడి లాలింపులా ఇల్లంటె ఒక పేగు బంధం
 

Follow Us:
Download App:
  • android
  • ios