పొట్లపల్లి శ్రీనివాసరావు కవిత : మన(సు)లో మాట

కనులు మూసి చూస్తే కమనీయ ప్రవాహం - కనులు తెరిచి చూస్తే కల్లోల ప్రపంచం అంటూ హనుమకొండ నుండి పొట్లపల్లి శ్రీనివాసరావు రాసిన కవిత ' మన(సు)లో మాట ' ఇక్కడ చదవండి : 

Potlapalli Srinivas Rao Telugu poem ksp

కలల రాతిరి కౌగిలింత
ఉరకలెత్తి మునకలేసేటి ద్వాదశకళల పుష్కరిణి 
దోసిలెత్తి దావతిచ్చె తేనెలొలుకు  మేథో మథన గానం

తెల్ల తెల్లని పొగ మంచు బిందువై
నులి వెచ్చని లేత కిరణ గంధమై
లోలోన ఏదో వెతుకుతున్న మది
ఎదపై వాలి పారిజాతమై నవ్వగ

నవ్వితే దోసిట మల్లెలు కురిసినట్లు
పరిమళ భరిత వాయువేదో తాకినట్లు
మంచంతా చల్లగా మనసంతా తెల్లగా
మంచు పూల వలపు మనసు వూసు తెలిపె

తళుకు బెలుకుల భ్రమలలోకంలో చికాకులెన్ని వున్నా
చివాల్న హృదయాకాశంలో ఇంద్రచాపమేదో వెలసినట్లు
మేలుకో నేస్తమాయని తట్టి అభయమేదో ఇచ్చినట్లు
మెరిసిన కనుల అనుభవాల అందమంతా కలంలో వొంపి
మంద మంద సుగంధమై వ్యాపించమనె
ప్రకృతి ఒడిలో పరవశంతో విహరించమనె

కనులు మూసి చూస్తే కమనీయ ప్రవాహం
కనులు తెరిచి చూస్తే కల్లోల ప్రపంచం
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios