పొద్దుటూరి మాధవీలత కవిత : వారధి

విప్పలేని  పొడుపుకథ ఒకటి మనతో దాగుడుమూతలు ఆడుతున్నది అంటూ నిజామాబాద్ నుండి పొద్దుటూరి మాధవీలత రాసిన కవిత  ' వారధి ' ఇక్కడ చదవండి : 

Podduthuri Madhavilatha poem - bsb - opk

నిండు చెరువు ఒడ్డుపై
నీ ప్రక్కనే కూర్చుని
మనసు విప్పి  మాట్లాడుకోవాలని ఉంది
గుండె బరువును ఒడుపుగా దించుకోవాలి
జీవితం నదిలోని ఆటుపోట్లను
అలుగువారిన చెఱువు
గుట్టుగా గుండెల్లో దాచుకుంది
తామరాకు మీది నీటిబొట్టు వలె
వరుసకు అందని బంధమేదో మనమధ్య అల్లుకుంది

పోటీపడి మరీ ఒడ్డును ఢీకొడుతున్న అలలు 
తీరాన్ని దాటలేవని తెలిసి
సంఘర్షణల కెరటం ఒకటి
తనకు తానే సంకెళ్ళు వేసుకుంది
నర్మగర్భంగా దాగిన సుడిగుండం నిర్దయగా
మనసును మెలితిప్పుతున్నది
అలలను తన్నుతు ఊరపిచ్చుక ఒకటి
ఆకాశం వైపు ఎగిరిపోయింది
కట్ట అంచున మొలిచిన తుంగ పొద 
నిర్వికారంగా తల ఊపిన సవ్వడి...
ఎన్ని వేదనలను కళ్ళారా
చూసిందో...నిస్సహాయంగా

చెరువు గర్భం నిండా ఎన్నో ప్రాణులు
జీవన్మరణ పోరాటంలో అలసిపోని యోధులు ఊపిరాడనివ్వని ఊసులను మూటకట్టుకొచ్చాయి నీళ్ళు
మాటకు, నీటికి
గట్టి బందమేదో వున్నట్లుంది
మనసుకు, మట్టికి
పోలిక ఏదో పెనవేసుకున్నట్లు ఉంది 
కవితకు, కన్నీటికి మధ్య 
వారధి ఎవరో కట్టినట్టున్నారు...
విప్పలేని  పొడుపుకథ ఒకటి
మనతో దాగుడుమూతలు ఆడుతున్నది
అందుకే
ఒక్కసారి మనసు విప్పి
నీతో మాట్లాడాలి...

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios