నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో రైతుల ఉద్యమం సాధించిన విజయంపై పెనుగొండ బసవేశ్వర్ కవిత రాశారు. దాన్ని పచ్చిన పొలాల పచ్చిని పండుగగా ఆయన అభివర్ణించారు.

ఈడ్చికొట్టిన ఈదురుగాలికి కూడా తలవంచక 
వరినారు గరికపోసలా గర్వంగా నిలబడ్డ క్షణాలివి

తుక్కురేపిన తుఫానులో సైతం అలలకు ఎదురీది 
కలల తీరం ముద్దాడిన నావికుల విజయగాధ ఇది

వ్యవసాయమంటేనే ఏ సాయం అందని పుణ్యదేశంలో మొదటిసారి పొలాలు గెలిచిన పచ్చని పండుగ ఇది 

మాకు గెలుపు కొత్త కావచ్చు, పోరాటం పాతదే 
అసలు రైతు బతుకంటేనే కన్నీటి పాట కదా!

నకిలీ విత్తనాల నష్టంతో నలిగిన వాళ్ళం 
గిట్టుబాటు ధర దక్కక గిట్టిన వాళ్ళం 
అతివృష్టి అనావృష్టిలకు ఆగమైన వాళ్ళం

గడ్డకట్టే చలి, జోరు వాన, కాల్చేసే ఎండ 
మా దేహాలకు నిత్య నైవేద్యాలే.. ఓర్చుకుంటాం

మట్టినుండి మమ్మల్ని వేరు చేస్తామంటేనే 
మరిగిపోయాము.. కన్నీరై కరిగిపోయాము

అయినా పర్లేదు.. కానివ్వండి..మంచిదే 
నల్లచట్టాలు మావల్లే బుట్టదాఖలు అవుతున్నవని 
ఎక్కడికక్కడ ఎవరికి వారు సంబరాలు చేసుకోండి

333 రోజులుగా భుజాన మోస్తున్న ఉద్యమకాడిని 
ఇప్పుడప్పుడే జార్చేసి పొందే సంతోషం మాకైతే లేదు

ఎందుకంటారా...

మేం రైతులమే కాదనీ, తీవ్రవాదులమని చేసిన
తీవ్రమైన నిందపై తీర్పు రావాల్సి ఉంది

మైళ్లకుమైళ్ళు నడిచి, పగిలిన పాదాలకు
మలామ్ పూయాల్సి ఉంది

అసువులు బాసిన 669 అమాయకుల 
ప్రాణాలకు పంచనామా జరగాల్సి ఉంది

రోడ్డునపడ్డ కుటుంబాల అరణ్య రోదనలకు
సంజాయిషీ చెప్పాల్సి ఉంది

ఊరేగింపు పైకి కారు ఉరికించినవాడికి
ఉరిశిక్షను మించి పడాల్సి ఉంది

అన్నింటి కంటే ముఖ్యంగా..

కార్పొరేట్లు మా పంటపొలాల్లో కాలుపెట్టకుండ
శాశ్వతంగా కంచె వేయాల్సి ఉంది

మా కడుపులు కాలినా కుటుంబాలు కూలినా
దేశానికి అన్నం పెట్టడమే మా అంతిమ లక్ష్యం