Asianet News TeluguAsianet News Telugu

ఘనంగా "పాలమూరు సాహితి" అవార్డు ప్రదానం

పాలమూరు గడ్డ నుంచి పాలమూరు సాహితి సంస్థ ప్రతి సంవత్సరం పురస్కారాలను లబ్ధప్రతిష్టులైన కవులకు ఇస్తుంది.  2022 సంవత్సరానికి గాను డాక్టర్ జెల్ది విద్యాధర్ రావుకు ఇచ్చారు.  సభ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి : 

Palamuru Sahithi Award distribution programme AKP
Author
First Published Oct 3, 2023, 11:25 AM IST

సమసమాజ నిర్మాణంలో రచయితలది క్రియాశీలక పాత్ర అని జిల్లా పరిషత్ చైర్మన్  స్వర్ణసుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ హైస్కూల్ లోని కాళోజీ హాల్ లో జరిగిన పాలమూరు సాహితి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లా కాదని కవుల జిల్లా అని, సురవరం ప్రతాపరెడ్డి జన్మించిన నేల అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో పాలమూరు కవులు తమదైన పాత్ర పోషించారన్నారు. ఎందరో కవులు, రచయితలు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి ఉద్యమానికి ఊపిరిలూదారన్నారు. నేడు మన సమాజంలో నెలకొని ఉన్న అసమానతలను రూపుమాపేందుకు కవులు విశేషంగా కృషి చేయాలన్నారు.

అనంతరం 2022 సంవత్సరానికి "అంతరంగపు భాష" కవితా సంపుటిని రచించిన  డాక్టర్ జెల్ది విద్యాధర్ రావుకు జెడ్పీ చైర్మన్ పాలమూరు సాహితి పురస్కారం  శాలువాతో పాటు 5116/- నగదు పురస్కారాన్ని అందజేశారు.  సభకు అధ్యక్షత వహించిన జిల్లా కళాకారుల సంస్థ అధ్యక్షులు వి.మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో మేలిమి సాహిత్యాన్ని సృజిస్తున్న కవులకు ప్రతి సంవత్సరం పాలమూరు సాహితి పురస్కారాలను అందజేయడం అభినందనీయమన్నారు. పాలమూరు జిల్లా సంస్థానాల ఖిల్లాగా పేరుగడించిందన్నారు. పాలమూరు సాహిత్యం తెలంగాణ సాహిత్యానికి దిక్సూచి అని కొనియాడారు. అప్పకవి జన్మించిన నేల నుంచి పాలమూరు సాహితి పురస్కారాలను అందజేయడం గర్వించదగ్గ విషయమన్నారు. ఎంతోమంది ఉద్ధండులైన కవులు, రచయితలు, పరిశోధకులు, విమర్శకులు పుట్టిన నేల పాలమూరు జిల్లా అని కొనియాడారు. 

పాలమూరు సాహితి అవార్డు వ్యవస్థాపకులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో సమాజాన్ని చైతన్యపరిచే కవిత్వాన్ని ఆవిష్కరిస్తున్న కవులకు గత పదమూడు సంవత్సరాలుగా పాలమూరు సాహితి పురస్కారాలను అందజేస్తున్నామన్నారు. పాలమూరు గడ్డ నుంచి పాలమూరు సాహితి సంస్థ ప్రతి సంవత్సరం పురస్కారాలను లబ్ధప్రతిష్టులైన కవులకు ఇస్తుందన్నారు. ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వేంకటేశ్వరరెడ్డి, ప్రముఖ విద్యావేత్త కె.లక్ష్మణ్ గౌడ్, పురస్కార గ్రహీత డాక్టర్ జెల్ది విద్యాధర్ రావులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గుంటి గోపి, బోల యాదయ్య, వల్లభాపురం జనార్దన, ఖాజా మైనోద్దీన్, పులి జమున, కోటి సుభాష్, దేవదానం తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios