“మన వారసత్వ సంపద” ఘనవిజయం :

తానా సాహిత్యవిభాగం నిర్వహించిన సభలో వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రలో మన తెలుగు భాషా సాహిత్యాలను తమ కలాలతో, గళాలతో సుసంపన్నంచేసిన ప్రముఖ కవిపండితుల వారసులు పాల్గొన్న అపూర్వ సమ్మేళనం వివరాలు ఇక్కడ చదవండి : 

Our heritage is a huge success - bsb - opk

డాలస్, టెక్సాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)  సాహిత్యవిభాగం “తానా ప్రపంచసాహిత్యవేదిక” నెల నెలా తెలుగు వెలుగులో భాగంగా  ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయస్థాయిలో అంతర్జాలంలో నిర్వహిస్తున్న కార్యక్రమ పరంపరలో భాగంగా ఆదివారం, జులై 30 న  నిర్వహించిన  “మన వారసత్వ సంపద”  విజయవంతంగా ముగిసింది.

ఈ సభను ప్రారంభించిన తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ మన తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన యింతమంది పండితుల వారసులను ఒకే వేదికమీద చూడండి  తానా చరిత్రలో ఒక మైలురాయి అంటూ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

ప్రతి నెలా క్రమం తప్పకుండా విభిన్న సాహిత్యఅంశాలమీద అంతర్జాలంలో జరుపుకుంటున్న ఈ 57 వ సమావేశం ఎంతో విశిష్టమైనదని, కట్టడాలు, పట్టణాలు కూలిపోవచ్చు గాని వీరు సృష్టించిన సాహిత్యం అజరామరం అని తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అన్నారు. 

తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రలో మన తెలుగు భాషా సాహిత్యాలను తమ కలాలతో, గళాలతో సుసంపన్నంచేసిన ఎంతోమంది కవి పండితుల  వారసులు పాల్గొంటున్న ఈ  సమ్మేళనం  అపూర్వం అని అన్నారు.   ఇది కేవలం వారు తమ వారసులకోసం మిగిల్చిన సంపదకాదని, ఇది తెలుగు జాతి సంపద అని, వారు సృష్టించిన సాహిత్యాన్ని భద్రపరచి, భావితరాలకు అందించవలసిన బాధ్యత మన అందరిదీ అని అభిప్రాయపడ్డారు.  మహాకవి తిక్కన, మహాకవి ఎర్రాప్రగడ, కంచెర్ల గోపన్న, కొప్పరపు సోదర కవులు, మహాకవి పోతన, మహాకవి శ్రీనాథుడు, పరవస్తు చిన్నయసూరి మరియు వేంకట పార్వతీశ్వర జంట కవులకు ఈ వేదికమీద వారి వారసులమధ్య పుష్పాంజలి ఘటించే అవకాశం గల్గడం తమ అదృష్టం అన్నారు.

ఎర్రాప్రగడ రామకృష్ణ ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ఈ సభలో
విశిష్టఅతిథులుగా   తలుపూరు వెంకట రామకృష్ణ మహాకవి తిక్కన 19వ తరం వంశీయులు;  గుడ్లూరు వెంకట పద్మనాభరావు మహాకవి ఎర్రాప్రగడ 9వ తరం వారసులు;   ప్రముఖ రచయిత కంచర్ల శ్రీనివాసరావు కంచెర్ల గోపన్న (భద్రాచల భక్తరామదాసు) 10వ తరం వారసులు; ప్రముఖ పాత్రికేయులు, కొప్పరపు కళాపీఠం వ్యవస్థాపకులు, కొప్పరపు కవుల మనుమడు మా శర్మ, ;   ప్రముఖ రచయిత్రి నెల్లుట్ల రమాదేవి మహాకవి పోతన 10వ తరం వంశీయులు ; ప్రముఖ కవి, శాసన, చారిత్రిక పరిశోధకుడు డా. కావూరి శ్రీనివాస్ శర్మ  శ్రీనాథ మహాకవి వంశీకుడు;  డా. వోలేటి పార్వతీశం వేంకట పార్వతీశ్వరకవుల పౌత్రుడు;  వచ గేయకవి పరవస్తు ఫణిశయన సూరి పరవస్తు చిన్నయసూరి 5వ తరం వారసులు పాల్గొని వారి వారి పాండిత్య వైభవాలను మాహాద్భుతంగా ఆవిష్కరించారు.  

ఈ సాహిత్యసభలో పాల్గొని విజయవంతంచేసిన అతిథులకు, ప్రసారం చేసిన మాధ్యమాలకు, కార్యకర్తలకు, తానా సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసింది. 
నాలున్నర గంటలకు పైగా సాగిన పూర్తికార్యక్రమాన్ని ఈ క్రింది లంకెలలో వీక్షించవచ్చును, మీ బంధుమిత్రులతో కూడా పంచుకోవచ్చును.
https://www.youtube.com/live/iwjWLrOJuEE?feature=share
https://youtube.com/live/X3ZQ4T0-qAg?feature=share
https://youtube.com/live/RuCNXF8sXks?feature=share

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios