ఒబ్బిని కవిత : తలంటు

కవి కయ్యాలమారి కాదు, గాయాల మర్రి అంటూ ఒబ్బిని రాసిన కవిత  " తలంటు " ఇక్కడ చదవండి.
 

obbini telugu poem talantu

తలంటు 

గీకిన ఐస్ మీద రంగు నీళ్ళు పోసి
పుల్లతో ఐస్ ఫ్రూట్ అమ్మిన
తోపుడు బళ్ళు కూడా కనబడడం లేదు –
ఓ గుప్పెడు మంచు గడ్డని కరిగించి
దోసిట్లో మంచినీళ్లలా తాగుదామనుకుంటే
ఎగసిపడే రుద్రజ్వాలలు తలంటుతున్నాయి !
ఒక్కో బాంబు ఒక్కో భాషని ,ఒక్కో భావాన్ని ,
ఒక్కో జన సమూహాన్ని ఖననం చేస్తుంది !
క్షీర సాగర మధనంలో
అదనపు విలువ అమృతమై కూర్చుంది,
నర మేధ యుద్ధ వేదంగా అమలవుతుంది !
దేశాల రహదారులన్నీ
రక్షా బంధనాల కోసం , తాయెత్తుల కోసం ఒకటే పరుగు !
కవీ నిన్నెవరూ పెళ్లాడ్డం లేదు
రహదారి పక్క నిలువు బండ రాయి మీద
అడ్డగా కొలువైన బండ రాయి
అడవి నుంచి ఓ స్త్రీ తల మీద
కట్టెల మోపుతో వస్తున్నట్టు అనిపించింది – అని నీవు చెప్పినా ,
ఉదయానికి ఓ మల్లె మొగ్గ విడినా
కాలుష్యాన్ని ఖాతరు చేయనక్కర్లేదనీ నీవు చెప్పినా -
ఈ నగరం
గడ్డ కట్టిన కాశ్మీర్ దాల్ సరస్సు  అని,
పాల పొంగు లక్ష్మి వెంట పరుగెడుతున్నారు యువ జనం అని, 
కుక్కలు లేని వీధులుంటాయా  అని అంటున్నావని
కయ్యాలమారి కాదు కవి ,గాయాల మర్రి కవి ,
కవిత్వం ఓ ముడి ఖనిజం అని అంటున్నావని -
కవీ నిన్నెవరూ పెళ్లాడ్డం లేదు !
“పుట్టినప్పుడూ యుద్ధమే
పెరిగినప్పుడూ సంగ్రామమే 
పాటుబడ్డప్పుడూ పోరే
విశ్రాంతి కోరుకునే సమయంలో కూడా
నిరంతర యుద్ధగాన ప్రదర్శనలే “ అన్న
జ్ఞాపకాలే గదా తలలో గూడు కట్టుకుంటున్నాయి!
కవీ నిన్నెవరూ పెళ్లాడ్డం లేదు!
అర్జెంట్ ఆపరేషన్ సమయాల్లో
అవయవాలని ఆసుపత్రుల్లో అందజేయడానికి
ఏర్పడ్డ గ్రీన్ చాన్నెల్స్ – నడవల నడకలని
నడవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు
కవీ నిన్నెవరూ పెళ్లాడ్డం లేదు!

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios