Asianet News TeluguAsianet News Telugu

ఒబ్బిని కవిత : మానిఫెస్టో మకుటాలు

ఈ మానిఫెస్టో మకుటాలు శ్వాశలేని దేహాలు ! అంటూ ఒబ్బిని రాసిన కవిత ' మానిఫెస్టో మకుటాలు ' ఇక్కడ చదవండి :

Obbini Kavitha : Manifesto crowns - bsb - opk
Author
First Published Nov 16, 2023, 11:24 AM IST | Last Updated Nov 16, 2023, 11:24 AM IST

సరుకుల విలువ కన్నా
అమ్మకపు ప్రకటనల విలువ మిన్నయినట్లు
మానిఫెస్టోల పథకాల ప్రచారం ఖర్చు హిమాచలమంత !

కొరతలు సృష్టించి
వస్తువులని అధిక లాభాలకి అమ్ముకున్నట్లు
ఓ నెల ఉల్లి సమస్య, 
ఓ నెల టమాటా సమస్య ,
ఓ నెల కందిపప్పు  సమస్య మానిఫెస్టో మకుటాలవుతాయి !

అయినా ఓటర్లకి
అర్ధనారీశ్వర అర్ధ ప్రతినిధులే –
సగం నేరం , సగం దోపిడి –
అచ్చు గుద్దబడతారు !
అడుగడుగునా పద్మవ్యూహం పన్నబడుతూ ఉంటుంది !

అభిమన్యత్వం పోషిస్తూ ఉంటారు ఓటర్లు
మూకుమ్మడి నామినేషన్స్ వేస్తూనో,
సామూహిక నిరసనలు ప్రదర్శిస్తూనో !
భూమి కోసమనో, జలాల కోసమనో, ఉద్యోగాలకోసమనో !

నోటి ఊట లాలాజలం    ఐటెమ్ సాంగ్ పాడినా,
దళారుల చేత వంత పాటలు పాడించినా 
ఎకరాల ఆసాములు నగరాలకి వలస పడుతూనే ఉంటారు !
వీధులన్నీ నిరసన వసంతాల గానం చేస్తూనే ఉంటాయి !

కాళ్ళకింద నేల పెకిలించబడుతున్నదని
చెమటతో తడిసిన మట్టి
దేశం భారం అవుతుందన్న
గట్టి పాఠాలతో  పుస్తకాలని అచ్చు వొత్తుతూనే ఉంది !
ఈ మానిఫెస్టో మకుటాలు
శ్వాశలేని దేహాలు !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios