నస్రీన్ ఖాన్ తెలుగు కవిత: తోలుబొమ్మ
సాటి మనుషులపై ప్రేమామృతాన్ని పంచే మనిషి కోసం తపిస్తున్న నస్రీన్ ఖాన్ కవిత "తోలుబొమ్మ" ఇక్కడ చదవండి.
మనిషి ఎలా ఉండాలి?
ఇంకిపోతోందీ ప్రశ్న
తృప్తి లేని జవాబుల సందడిలో
అన్వేషణా దాహం
అంతం కాలేదేనాడు
మనోఫలక అంతర్నేత్రాల
కోరికల చిట్టా విప్పితే...
తోటి జీవులపట్ల
సాటి మనుషులపై
దయ చిప్పిల్లే కళ్ళతో
ప్రేమామృతాన్ని పంచే
మనిషి కావాలనిపిస్తోంది
ప్రాణం ధారబోసే స్నేహ శీలి
రక్తమాంసాల జవజీవాలు
తిరుగాడిన నేల ఇదేనని గుర్తుకొస్తుంది
మరైతే
మనిషి తత్వంపై అనుమానమేమిటి?
వెంటాడే ఈ ప్రశ్ననే గుండెకు చేరేసాను
తను అద్దం వైపు నడిపించింది
తేరిపారా చూస్తూండిపోయాను
విచిత్రం...
నేనూ ఈనాటి మనిషినే
ఏదైనా మారొచ్చు
ఎంతైనా మార్చొచ్చు
మాటలు తెలిసిన మనిషి
శాసనంలో ఆరితేరిన మనిషి
వినాశనంలో చేయి తిరిగిన మనిషి
మసకబారితే వింతా?
అంతా
కాలం చేసే కనికట్టైతే...