జానపద సినిమాలపై పరిశోధనలు... తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణకు డాక్టరేట్

జానపద సినిమాలపై చేసిన పరిశోధనకు గాను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్ అందించింది. 

mamidi harikrishna  gets doctorate in folk movies

“తెలుగు సినిమాలలో జానపద కథాంశాలు – అధ్యయనం” అనే అంశంపై డాక్టర్ భట్టు రమేష్ పర్యవేక్షణలో విస్తృతమైన పరిశోధన చేసిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు డాక్టరేట్ లభించింది. ఇందుకు సంబంధించిన పట్టాను వరంగల్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం నుండి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రకటించింది. 

1896 లో ప్రపంచంలో తొలిసారిగా లూమియెర్ బ్రదర్స్ ద్వారా చలనచిత్రాలు ఆవిష్కరించబడిన తర్వాత, 1913 లో   భారతదేశంలో సినీ నిర్మాణం దాదా సాహెబ్ ఫాల్కే ప్రారంభించిన తదుపరి 1931 లో తెలుగులో సినిమాలు భక్తప్రహ్లాదతో  మొదలైనప్పటి నుంచీ ఇప్పటి వరకు 90 ఏళ్ళ తెలుగు సినీ ప్రస్థానంలో దాదాపు 8600 పైగా చలనచిత్రాలు తెలుగులో నిర్మాణమయ్యాయని ఈ పరిశోధనలో ప్రస్తుతించారు. అంతేగాక 1938 ‘గులేబకావళి’ సినిమాతో మొదలైన జానపద సినిమాలు ‘బాహుబలి’ సినిమా వరకు సినీ రంగంలో చూపిన ప్రభావాన్ని ఈ పరిశోధన చారిత్రక దృష్టితో, సమగ్ర వ్యూహంతో పరిశోధించిందనీ, అంతర్జాతీయంగా వివిధ దేశాల జానపద గాధలు సినిమాలుగా తెరకెక్కిన విధానం, వేర్వేరు భారతీయ భాషలలో వచ్చిన సినిమాలలో జానపద కథాంశాల తీరు, తెలుగు సినిమాలలో జానపద లక్షణాలు, కథాంశాల విశ్లేషణ సోదాహరణంగా, విస్తృతంగా అందించడం విశేషమని పరీక్షకులు అభిప్రాయపడ్డారు. 

24 క్రాఫ్ట్ లను జానపద సినిమాల నిర్మాణంలో ఉపయోగించే తీరు, జానపద సినిమాల చిత్రీకరణలో ఆర్ట్ డైరెక్షన్, రచయిత, మేకప్, కెమెరా, ట్రిక్ ఫోటోగ్రఫీ, స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ వంటి సాంకేతిక నైపుణ్యాల పాత్రను ఈ పరిశోధన తులనాత్మకంగా పరిశీలించిందని... ప్రాంత, భాష, వయో భేదాలకు అతీతంగా జానపద సినిమాలకు ప్రజాదరణ లభించడం వెనుక ఉన్న సామాజిక, మానసిక, చారిత్రక అంశాలను ఉదాహరణలతో సహా వెల్లడించిన తీరు విశిష్టంగా ఉందని పరీక్షకులు అన్నారు.

తెలుగు సినీ పరిశోధనా రంగంలో జానపద సినిమాలపైన చేసిన ఈ విశ్లేషణ ఒక వినూత్నమైన వెలుగును ప్రసరించడమే కాక, ఇప్పటి దాకా తెలియని ఎన్నో అంశాలను సాంకేతికంగా, సృజనాత్మకంగా ఉన్న విశేషాలను ఈ పరిశోధన వెల్లడి చేసిందని, భవిష్యత్ పరిశోధనలకు ఇది రిసోర్స్ గ్రంథంగా, పరిశోధకులకు రిఫరెన్స్ పుస్తకంగా నిలుస్తుందని పరిశోధన చేసిన మామిడి హరికృష్ణను అభినందించారు. జానపద విజ్ఞానం వెలుగులో సినిమాలను విశ్లేషించడం పరిశోధనా ప్రస్థానంలో వినూత్నమైన కోణం అని అభిప్రాయపడ్డారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios