మల్యాల మనోహర రావు కవిత : గంగా భవాని

ఒకప్పుడు చేదబావి నిండా కబుర్లే కబుర్లు.  పాపం ఇప్పుడది పలకరించే దిక్కులేక...ఒంటరైంది అంటూ హన్మకొండ నుండి మల్యాల మనోహర రావు రాసిన కవిత  ' గంగా భవాని ' ఇక్కడ చదవండి :

Malyala Manohara Rao Poem : Ganga Bhavani..ISR

ఇది నలుబది ఏళ్ల
క్రిందటి నీటి మాట
ఇప్పటికి చెరిగిపోని
గీటు వ్రాత

ఆ ఉరికి ఒకే ఒక్కచేద బావి
నాలుగు వైపుల గిలకలు
నిర్విరామంగా
వినులవిందగు
జల సంగీతం

మూరెడు పిల్లనుంచి
ముసలవ్వలదాక
గుమిగూడే ముచ్చటైన ప్రదేశం
ముంతనో కడవనో
బిందెనో  గిన్నెనో
పాత్ర ఏదైనా దాహం దీర్చే
జలామృతం ఒక్కటే...

అక్కడే అచ్చట్లు ముచ్చట్లు
నిట్టూర్పులు ఓదార్పులు
పరిహాసాలు పంచాయితీలు
నలుగురితో పంచుకుని 
దించుకునే గుండె బరువులు
రహస్యాలు లేని రచ్చ బండ
సులువుగా పరిష్కారంచెప్పే ప్రజా కోర్టు
అందరికి ఇష్టమైన ప్రదేశం

ఆ చేన్తాళ్లు ఎన్ని చేతి రేఖలు చదివాయో
చేదనుండి తొణికిపడే నీళ్లు
ఎన్ని కన్నీళ్లను దిగమింగాయో
కిలకిలాలాడే గిలకలు
ఎన్ని రసవత్తర జీవన గీతాలు విన్నాయో..
ఆ చేదబావి నిండా కబుర్లే కబుర్లు 
ఎన్ని తోడుకున్నా ఇంకా మిగిలే కథలు 

కలతలు కన్నీళ్లు
సరదాలు సంబరాలు
కడుపులో పెట్టి దాచుకున్న
నాటి ఊరు ఊరంతటికి పెద్దదిక్కు 
కరుణామయి గంగా భవాని

పాపం ఇప్పుడది 
పాడుబడిపోయింది 
పలకరించే దిక్కులేక... ఒంటరైంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios