పదాల అల్లికలోని  అమృత గుళికలను మల్యాల మనోహరరరావు 'అల్లిక' కవితలో  చదవండి.

ఒక్కొక్కసారి 
పదాలు అలవోకగా 
రంగవల్లులై 
రాలిపడుతుంటాయి 
ఒకసారి అలిగి 
మెలికలుతిరిగి 
అలివేణి జడపాయలై 
హొయలుపోతుంటాయి 

ఒకో సారి 
పాలనురగలా 
ముత్యాలను 
మరిపిస్తుంటాయి 
మరొకసారి 
పక్షిగూడులా 
అర్థంకాక 
పరీక్షపెడుతుంటాయి

ఎప్పుడు మనిషి 
పదాల అల్లిక
అలవర్చుకున్నాడో 
ఏమోగానీ 
పదాలు మనిషి 
గుండె గదులైనాయి 
జీవనగతులైనాయి 

పదాలు జానపదాలై 
జలకాలాడాయి 
ప్రబంధాలై 
పల్లకీ నెక్కాయి 
పాటలై వీణలు 
మీటాయి 
జావళీలై
నాట్యంచేశాయి 
షాహరీలై షహనాయ్ 
వాయించాయి 

కారుమబ్బులై 
ఉరిమిచూసాయి 
పిల్లగాలులైపలకరించాయి
పోరుధారలై పొంగి 
ప్రవహించాయి

 మల్లెపూలై 
మరులుగొలిపాయి
పల్లెతనానికి 
సొగసులద్దాయి
పడచుతనానికి 
సిగ్గుతొడిగాయి

ప్రకృతిలో 
అణువణువునా 
అమ్మనుచూపాయి
అంతర్యామికి 
ఆకృతులనిచ్చాయి 
మనిషి అస్తిత్వానికి
తరతరాలుగా 
ప్రతీకలైనాయి

పదాల అల్లిక 
ఆత్మానందానికి 
అమృత 
గుళిక .