మధుకర్ వైద్యుల కవిత : అమ్మనని మరిచిపోయావా?
అమ్మతనాన్ని మరిచిపోతున్న కర్కశత్వాన్ని " అమ్మనని మరిచిపోయావా? " అంటూ మధుకర్ వైద్యుల ఎలా ప్రశ్నిస్తున్నారో ఈ కవితలో చదవండి :
అమ్మనని మరిచిపోయావా?
నీవు నన్ను అమ్మ పక్కనుంచి సుతిమెత్తగా
చేతుల్లోకి తీసుకుంటే ఊయలూపుతావనుకున్న
పొత్తిళ్లతో సహా నన్ను అమాంతం ఎత్తుకుంటే
నీ గుండెల్లో వెచ్చతనాన్ని వెతుక్కున్న
నీ రెండు చేతుల్లో కదలకుండా పట్టుకుంటే
పడిపోకుండా నన్ను ఒడిసిపట్టుకున్నవనుకున్న
నీ భుజం మీద నన్ను బజ్జోపెట్టుకొని బయలుదేరితే
నన్ను ప్రేమతో ఆటాడించడానికని భ్రమపడ్డా
చీకటి సందుల్లోంచి నీవు పరిగెడుతుంటే
నాకు భయం కాకుండా జాగ్రత్తపడుతున్నావనుకున్న
నెలలు నిండని నన్ను నీ బావుల్లో బంధిస్తే
నెలవంకలా నన్ను ముద్దాడుతావనుకున్న
కానీ
కామంతో కళ్లుమూసుకుపోయిన నీవు
మాంసపు ముద్దపై పశువాంఛ తీర్చుకుంటవనుకోలే
పాలుతాగడం తప్ప ప్రపంచమేంటో తెలియని నేను
పాపపు పని చేయాలన్న నీ ఆలోచనను పసిగట్టలే
ఉగ్గపట్టి ఏడ్వడం తప్ప అమ్మ అని అరవలేక నేను
నరకయాతన అనుభవిస్తుంటే నీలో కనికరం లేకపాయే
నీకు జన్మనిచ్చిన అమ్మతనాన్ని మరిచిపోయి
వసివాడని పసిదానిపై మృగానివై దాడిచేస్తివి
ముక్కుపచ్చలారని తొమ్మిది నెలల చిన్నారిని చంపి
నీవు చిదిమేసింది మీ అమ్మనని మరిచిపోతివి