తెలుగు భాషని రక్షించుకుందాం

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి రోడ్డులో గల తెలంగాణ సాంఘిక గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో  అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిన్న ఘనంగా నిర్వహించారు. ఆ వివరాలు ఇక్కడ చదవండి : 

Lets save Telugu language - bsb

ప్రపంచంలోనే అతి తీయనైన భాష తెలుగు భాష అని, అది గొప్పదైన భాషని వక్తలు కొనియాడారు. తెలుగు భాషకు ఉన్న గొప్పతనం పద్యమని ఇతర ఏ భాషలో పద్యం లేదని‌, గద్యమే ఉందని ప్రముఖులు పేర్కొన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి రోడ్డులో గల తెలంగాణ సాంఘిక గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా విచ్చేసిన పాలమూరు సాహితి అధ్యక్షులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి భాష తెలుగు భాష అని, తెలుగు భాష  అంటే ఒక సముద్రమని అన్ని భాషలు తెలుగు భాషలోనే ఉన్నాయని అన్నారు. మనము అసలైన తెలుగు భాషను మర్చిపోతున్నామని కేవలం 40 శాతం మాత్రమే తెలుగు భాషను మాట్లాడుతున్నామని, మిగతా కొంత సంస్కృతం,  కొంత ప్రాకృతం, కొంత ఉర్దూ, కొంత ఆంగ్లం కలగలిపి మాట్లాడుతున్నామన్నారు. మన తెలుగు భాషను మనం పరిరక్షించకపోతే భవిష్యత్తు తరాలు మనలను క్షమించవన్నారు. కాలక్రమేణా తెలుగు భాష కూడా కనుమరుగయ్యే దుస్థితిలో ఉందన్నారు.

ప్రపంచంలో మొత్తం 6000 భాషలు ఉంటే ఇప్పుడు కేవలం 125 భాషలు మాత్రమే ప్రపంచంలో వాడుకలో ఉన్నాయన్నారు. మిగతావన్నీ కాలగర్భంలో కలిసిపోయాయన్నారు. కావున మనమందరం తెలుగు భాష రక్షణకై నడుం బిగించాలన్నారు. ఇంట్లోనూ, బంధువులతోనూ ఎక్కడైనా తెలుగు భాషను మాట్లాడాలని, కేవలం ఉన్నత విద్యకు మాత్రం మనం ఆంగ్ల భాషలో చదవాలని ఆయన సూచించారు. 

గౌరవ అతిథిగా విచ్చేసిన లుంబిని పాఠశాల అధినేత కే. లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో ఎంతోమంది కవులు, రచయితలు తెలుగు భాషను సుసంపన్నం చేశారన్నారు. అలాంటి గొప్ప తెలుగు భాషని మనం మర్చిపోకుండా నిత్యం సంభాషించాలన్నారు. ఆంగ్లభాషలో మనం చదువుతున్నప్పటికీ మాతృభాషను మరువద్దని సూచించారు. అలాగే కవయిత్రి జి. శాంతారెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష గొప్ప భాషని, ఆంగ్ల భాషా వ్యామోహంలో పడి తెలుగు భాషను మర్చిపోకుండా కాపాడుకోవాలని సూచించారు. సమన్వయ కర్త,  కళాశాల తెలుగు అధ్యాపకులు రావూరి వనజ మాట్లాడుతూ తెలుగు భాషా పరిరక్షణకు విద్యార్థినులే ముందుండి నడుం బిగించాలన్నారు. తెలుగు భాష ఔన్నత్యం గురించి వివరించారు.

గొప్పదైన తెలంగాణ భాషను అందరూ ఆదరించాలని, అందరం తెలుగులోనే మాట్లాడితే ఆ స్వచ్ఛమైన తెలుగు భాష ఎప్పటికీ నిలుస్తుందన్నారు. తెలుగు భాష మాట్లాడితే స్వచ్చంగా మాట్లాడుతున్నట్టు ఉంటుందన్నారు. ఎంతో గొప్పదైన తీయనైన తెలుగు భాషని మనమందరము ఎల్లప్పడికి మాట్లాడుతూ ఉంటే కనుమరుగయ్యే ప్రసక్తే ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, తెలుగు అధ్యాపకులు డాక్టర్ బి భారతి, డాక్టర్ శ్రీలత, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios