కె ఎస్ అనంతాచార్య తెలుగు కవిత మాటల కత్తి !!
తెలుగు సాహిత్యంలో కవిత్వం అత్యంత విశిష్టమైంది, ప్రత్యేకమైంది. కేఎస్ అనంతాచార్య రాసిన మాటల కత్తి కవిత చదవండి.
ముఖ కుహరంలో
దంత కుడ్యాల మధ్య
అంగిలి కింద
లాలాజల భరిత నాదోదోద్భవ జీవన్మూలం !
వల్లె వేసిన వేద వారసత్వ
అసాధారణ జ్ఞాన చూలిక
నరం లేకున్నా నరుని పైన
అజమాయిషీ చేసే మంత్రదండం
గలమ బయట కాలు పెట్టక ఆడించే బవురూపుల నాయక
నాలుకంటే ....
నాలుగు దిక్కుల పరచిన వార్తాపత్రిక
తనను తాను ఆకాశంలో
చూపించుకొనే పొగరుబోతు పొట్టేలు
చెవులమీది వసపిట్ట
పళ్ళులేని....
కళ్ళను బోల్తా కొట్టించే....
దీని కండర సాక్ష్యం ముందు
మనసు భావాలన్నీ పూర్వ పక్షమే!
కోర్టులోని గీతా ప్రమాణమై నిలిచునే ప్రజా పక్షం !
దీని పదనుకు పోలిక లేదు
నిలువునా గుండెను చీల్చగల మాటల కత్తి
చేదు మొగ్గల మీది చెత్త ఆలోచన !
తేనెలో అద్దిన తెలుగక్షరం
కోయిల గొంతులోని కొత్త వెన్నెల పాట
పచ్చని పైట వేసుకున్న ప్రకృతి ఒడిలో జానపదుని తెలంగాణా పల్లెతల్లి సింగారం
పెచ్చులూడిన ఒక సత్యం కోసం ఆరాటపడే సత్యవతి
దొర్లి దొర్లి మలకబడి తిరగబడి తొక్కిసలాడి ఎత్తిన జండాకోసం పాడే జాతి ఆర్తి గీతం !
రుచుల మీద ధ్యాస
జృంభిత మన: శ్వాస
కొమ్మ మీది పులుగు
అంతరంగపుతలపు!
పంచదార లేని పాయసం
మనసు తీపి చేసి పనులను
చక్కదిద్దే బుద్ధిమాన్
బంధాల బయటకూడ్చే ఊడుపరి
ఆత్మను పుక్కిట పెట్టుకొన్న నాలిక
వాక్స్పర్శతో వశపరచుకోగల అభిసారిక
అధికారాన్ని ఊడగొట్టుకునే దురదగొండి
కాలo తలాపున నిలబడ్డ సూర్యుడు
కావ్యవర్ణనల్లోకి వంపిన రస నివేదన !
ఎండిన డొక్క మీద వాయించే ఆకలి మృదంగం!