కోట్ల వెంకటేశ్వర రెడ్డి కవిత : మేమెటు వైపో తేల్చుకుంటాం!

కవిత్వం వంటిదే పదవీ వ్యామోహం.. మొదలైందా తీరని దాహమే! అంటూ కోట్ల వెంకటేశ్వర రెడ్డి రాసిన కవిత  'మేమెటు వైపో తేల్చుకుంటాం!' ఇక్కడ చదవండి : 

Kotla Venkateswara Reddy's poem - bsb

ఎవరి రొట్టె విరిగి
నేతిలో పడుతుందో
కాలం రొట్టె పట్టుక తిరుగుతోంది!

పాదయాత్రల్లో పలకరింపుల్లో
వావి వరుసలకేం కొదవ
పెదవుల మీదే అనుబంధాల అల్లికలు!

కవిత్వం వంటిదే
పదవీ వ్యామోహం
మొదలైందా తీరని దాహమే!

యుద్ధం ఇప్పుడేం లేదు
తొడ గొట్టడాలూ మీసం దువ్వడాలూ
ఒట్టి శక్తి ప్రదర్శనలకే!

ధవళ వస్త్రాలూ
డాంభిక ప్రదర్శనలూ
ఫ్లాప్ చిత్రాల ప్రచారం వంటివే!

వాంఛలకు ఆడా మగా తేడాల్లేవ్
దమ్ముందా ధైర్యముందా అన్నావా
ఏదో వైపు నుండి రాయి ఎగిరి పడుతుంది!

నాకిప్పటికీ
మట్టినే నమ్మే దేశ భక్తులంటే నవ్వొస్తది
శూన్య హస్తాలు వాంఛలను తీర్చలేవు!

కాలం కలసి రావాలి కాని
అగ్ని ప్రవేశం చేయన్దే
ఓట్లు అడగనీయ రాదు!

లోన ఏ దుఃఖముండదు
కించిత్ దయా ఉండదు
కవిత్వం అల్లితే జనం తిరగబడరా?!

వేరు వేరు సభల్లో కాదు
అంతా ఒకే వేదిక మీదకు రండి
మేమెటు వైపో తేల్చుకుంటాం!!
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios