కోట్ల వెంకటేశ్వర రెడ్డి కవిత : వెలుగు జిలుగుల అమావాస్య!
తెలంగాణలో తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే అది పెద్ద పండుగ బతుకమ్మ ఈరోజు నుండి మొదలవుతున్న సందర్భంగా కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వర రెడ్డి రాసిన కవిత ' వెలుగు జిలుగుల అమావాస్య! ' ఇక్కడ చదవండి :
ఈ మహాలయ అమావాస్య ఒక్కటే
మా ఇంట వెలుగు జిలుగులు నింపేది
బహుశా ఈ వెలుతురు పండగ కోసమే
నేను ఏడాదంతా ఎదురు చూస్తాను!
పెద్దల పండగ నాడు అమ్మా నాన్నలు సరే
నానమ్మనే నాలా కొంచెం తొందర మనిషి
అందరి కంటే ముందే వచ్చేస్తది
అనాదిగా నాకోసం ఆమెది అదే తండ్లాట!
తాతతో నాకు జ్ఞాపకాలేమి లేవు
భవ సాగరం ఈదలేని బలహీనుడు
భారాన్ని నాన్న మీద మోపి అర్ధాంతరంగా
వేపల అడవిలో ఉరేసుకున్న భయస్తుడు!
పెద్దల పండగనాడంతా మా ఇంట్లో
మా ఇంటి ఆడ బిడ్డలదే పెద్దరికం
వచ్చినప్పుడల్లా కళ్ళతో దీవించి నాలో
ఏడాదికి సరిపోయే కాంతులు నింపిపోతారు!
వాళ్ళొచ్చినప్పుడల్లా మా పాతిల్లు
పవిత్రతను సంతరించుకుంటది
నేనొక్కన్ని నాకు నలుగురు చెల్లెండ్లు
తలో చేయివేసి నన్నిలా నిలబెట్టారు!
తల నిమిరే అమ్మా నాన్నలు సరే
తరచి తరచి చూసుకున్న కొద్దీ
అమ్మానాన్నలు పోతూ పోతూ
నలుగురు తల్లులనిచ్చి పోయారనిపిస్తది!
పెద్దలకు ఎడపెట్టి ఒకచోట అందరం
కలిసి కూచొని తింటుంటే
జీవితానికి ఇంతకంటే
సార్ధకత ఏముంటదనిపిస్తది!!