ఈ వాన జల దృశ్యాలను కలగన్న కాకతి వారసునికి స్వాగత గీతంలా ఉంది! అంటున్న కోట్ల వెంకటేశ్వర రెడ్డి కవిత  "  ఒక వాన - కొన్ని దృశ్యాలు! " ఇక్కడ చదవండి:

ఒక ఉరుమూ లేదు
ఒక మెరుపూ లేదు
ముందస్తు ఎన్నికల్లా వర్షం!

మనిషికి పడిషం పట్టినట్లు
పగలూ రాత్రీ
వదలని ఒకటే ముసురు!

అధికారాన్ని వాంఛించే
ప్రతి పక్షాల్లా నదీ నదాలది
ఒకటే హడావుడి పరుగు!

ఫలితాలు రాక మునుపే
విజయాలను కలలుగనే పార్టీల 
ఎద పొంగులా సముద్రం!

బయటంతా చిత్తడి చిత్తడి
పద్యం పలకని కవి హృదయంలా
ఒక్క రైతు కళ్ళలోనే మెరుపులు!

చూస్తుంటే ఈ వాన
జల దృశ్యాలను కలగన్న 
కాకతి వారసునికి స్వాగత గీతంలా ఉంది!

ఎవరి మాటలు లెక్క చేయని జనం
వాన వల విసురుకు స్వచ్ఛందంగా 
లాక్ డౌను ప్రకటించుకున్నారు!!