ఉత్తమ కవిత్వానికి గీటు రాయి కొత్తపల్లి నరేంద్రబాబు పురస్కారం - పురస్కార ప్రదానోత్సవ సభలో వక్తలు
కొత్తపల్లి నరేంద్రబాబు పేరుతో ప్రతి ఏటా ఇస్తున్న సాహిత్య పురస్కారానికి గాను 2002 సంవత్సరానికి చీరాలకు చెందిన రచయిత కవి పి శ్రీనివాస్ గౌడ్ రచించిన 'చిన్న చిన్ని సంగతులు' కవితా సంపుటి ఎంపిక కాగా 2023 సంవత్సర పురస్కారానికి గూండ్ల వెంకటనారాయణ అనే యువకవి రచించిన 'ఇయ్యాల ఊళ్లో 'సంపుటి ఎంపికైంది.
కొత్తపల్లి నరేంద్రబాబు పేరుతో ప్రతి ఏటా ఇస్తున్న సాహిత్య పురస్కారానికి గాను 2002, 2023కు ఎంపికైన ఇద్దరు రచయితలకు ఒకే వేదికపై పురస్కార ప్రదానం జరిగింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి :
రాయలసీమ కవిత్వానికి తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని ఇందుకోసం ఎందరో కవులు కృషి చేశారని ఇప్పటి యువకవులు కూడా ఆ దిశగా నడుస్తూ ఉండడం ఎంతో సంతోషదాయకమని డాక్టర్ శాంతి నారాయణ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నిన్న సెంట్రల్ లైబ్రరీ, అనంతపురంలో జరిగిన పురస్కార ప్రదానోత్సవ సభకు డాక్టర్ శాంతి నారాయణ అధ్యక్షత వహించగా పలువురు వక్తలు హాజరై ప్రసంగించారు.
ఆర్ధ్రమైన గొంతుతో రైతు జీవితాన్ని గానం చేసిన ఆది ఆంధ్ర తిప్పేస్వామి ఉద్దీపన గీతంతో కార్యక్రమం మొదలు కాగా ముఖ్యఅతిథి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత బండి నారాయణస్వామి మాట్లాడుతూ నన్నెచోడుడు నుంచి నేటిదాకా తెలుగు సాహిత్యంలో వచ్చిన మలుపుల్ని ఆ మలుపులో నుంచి పుట్టుకొచ్చిన కవితా ఉద్యమాల్ని చెబుతూ నేటి కవులు వర్తమాన సమాజంలోని పోకడలను నిశితంగా పరిశీలిస్తూ వాటిని కవిత్వం చేయాలని సూచించారు.
విశిష్ట అతిథి వెంకటకృష్ణ మాట్లాడుతూ నరేంద్రబాబు పురస్కార గ్రహీతల కవిత్వం కాలానికి నిలబడే కవిత్వం అని అన్నారు. అలాగే సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ గౌరవ అతిథిగా హాజరై ప్రసంగించారు. వారు మాట్లాడుతూ నరేంద్రబాబు గొప్పకవి అని ఆయన రాసిన కవిత్వాన్ని ఒక పుస్తకంగా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ హిందీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జివి రత్నాకర్ మాట్లాడుతూ పురస్కారం వైపు రెండు రాష్ట్రాలు చూస్తున్నాయని ఈ దిశగా ఈ అవార్డును తీర్చిదిద్దిన నిర్వాహకులు కొత్తపల్లి సురేష్ ని అభినందించారు. ఆత్మీయ అతిథి శశికళ మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ అవార్డు ఒక నిబద్ధతతో ఇస్తూ ఉండడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని నిర్వాహకుల్ని అభినందించారు.
మరో ఆత్మీయ అతిథి తూమచర్ల రాజారాం మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో వస్తున్న ఉత్తమ కవిత్వాన్ని కచ్చితంగా తూనిక పట్టే అవార్డుగా కొత్తపల్లి నరేంద్రబాబు అవార్డు నిలుస్తోందని కొనియాడారు. అవార్డు పొందిన కవితా సంపుటాలపై సురగౌని రామకృష్ణ , డాక్టర్ శ్రీనివాస్ అంకె చక్కని సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో చివరిగా ఆప్త వాక్యాలు పలుకుతూ సిద్ధగిరి శ్రీనివాస్, గుడిపల్లి విద్యావతి, చంశాస్త్రి విలువైన సందేశాలు ఇచ్చారు.
చివరిగా విజేతలకు అందరి చేతుల మీదుగా ఘనంగా పురస్కార ప్రదానం జరిగింది. పురస్కార గ్రహీతలు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం తమకు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కవిసమ్మేళనం అడ్మిన్, కొత్తపల్లి నరేంద్రబాబు అవార్డు వ్యవస్థాపకులు కొత్తపల్లి సురేష్ , అన్న అశోక్ కుమార్, పోతుల రాధాకృష్ణ, కోటిగారి వన్నప్ప,డాక్టర్ జెన్నే ఆనంద్ కుమార్, షేక్ నబి రసూల్, చెట్ల ఈరన్న, మిద్దె మురళీకృష్ణ, చేగువేరా హరి, వంశీ, వలస రమేష్, చిలుకూరి దీవెన, ప్రగతి, అడ్వకేట్ శరత్, లైబ్రేరియన్ సుబ్బరత్నమ్మ, ఉపాధ్యాయ మిత్రులు తదితర సాహిత్య అభిమానులు పాల్గొని సభను విజయవంతం చేశారు.