కొండపల్లి నీహారిణి కవిత : ఎక్కడికో ఈ పయనం
రాలిన కన్నీటి బొట్లను రాబోయే తరాలకు కానుకివ్వకుంటే చాలు అంటూ కొండపల్లి నీహారిణి రాసిన కవిత " ఎక్కడికో ఈ పయనం " ఇక్కడ చదవండి :
చెట్లు పలు సహాయాల పరిమళాలు
కిరణజన్య సంయోగక్రియ ఒక జీవన సిద్ధాంతం
మిథ్య కాని జగత్తు చిల్లుల కుండైనా
బ్రతుకు పత్రంపై రాయని కవిత్వమవుతున్నప్పడు రంగులు వెలిసిన భావమూ ఉంటుంది
మాయదారి లోకం పోకడ తెలియని పక్షి రెక్కలు రుధిరాన్ని కురుస్తూనే ఉంటాయి
రాత్రి చీకటిని ఆహ్వానించిన పిట్టలు
పచ్చ పచ్చని ముసుగును తొలగించి కిల కిల రావాలవుతాయి
రాలుగాయి కాలమొకటే
రాబోయే వేట వ్రేటును చెప్పదు
హద్దులు లేని మనుషుల మధ్య
వారధి వద్దని అనలేని వారి ఆర్తనాదం
వైరి సమాసమవుతుంది
సరిహద్దులు దాటించి ఛిద్రచిత్తరువును చేస్తుంటారు
పక్క సందులో పొంచిన ప్రమాదాలే తెలియక
సంధి పదాల తికమకలలో పూర్వ పరభేదాలేమి పసిగడతాయా పసిరూపులు
అమాయక గుడ్డి మాలోకాలు
కాలితేగాని చేయిని తీసుకోలేని కన్నెతనాలు
కన్నవారిని వీడి
కనిపించేదంతా సుందర స్వప్నాలలో స్నానమాడిస్తుంటారు
అమ్మివేసినా అకాల ధరలవుతుంటారీ ధరణీ పుత్రికలు
కొనుగోళ్లకు కోతలూ అవుతుంటారీ కోమలాంగులు
ఎదురీత ఎరుగని ఎడ్డి జనాలు
ఎత్తిపోతల పథకాలలో రాసుకునే
ఒప్పంద దందాలుగా పంచనామాలలో కార్య స్థలాలవుతుంటారు
లవ్వు గివ్వూ కాదు
లవలేషమైనా సోయుంటే
సోషల్ నెట్ వర్క్ లో వర్కింగ్ బొమ్మలవ్వరు
కాని కాలం కథా కమామీషులేం తెలుస్తాయి
విలువలు నేర్పిస్తుందన్న భ్రమలలో పరిభ్రమిస్తూ వలలో చిక్కే జింకలవుతుంటారు
ఈ లోపు నేనున్నానంటూ నక్కజిత్తుల మాటలు ఊదరగొట్టిన వీధి పహిల్వాన్ చందమవుతుంటాయి
చెదిరిన కలల వృష్టిలో
పట్నం నాలాల జోరు ప్రవాహాల్లో పడిన నిర్జీవ శరీరాలలా
ఒకటేదో టెలీ ఫిలిమ్ భావన గుండె వాకిలిన పడి ఏడుస్తుంటుంది
రాలిన కన్నీటి బొట్లను
రాబోయే తరాలకు కానుకివ్వకుంటే చాలు
కాలిన కలలూ రాలిన నీరూ
కడలిలో కలిసే వ్యథలూ
కథగా మిగిలిపోతుంటాయి
ఎన్ని జరిగినా ఆమెలు వీళ్ళందరికీ తల్లులవుతూనే ఉంటారు
మరో నీతిలేని లోకాన్ని కంటూనే ఉంటారు