ఎవరికోసం ఈ ఎదురీతనో ....!!? అని ప్రశ్నిస్తూ డాక్టర్ కొండపల్లి నీహారిణి రాసిన కవిత 'మిగిలిన ప్రశ్నవు ' ఇక్కడ చదవండి : 

లోకాన్ని దాటి 
ప్రతిరోజూ నీదవుతున్నప్పుడు
గాలి సంతకాలు వెనువెంట నీవవుతున్నప్పుడు 
జారిపోని కలలా ప్రతి క్షణం 
ఎదురొస్తున్న సంగతులే కానుకలు!

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కొండలూ రాళ్ల గుట్టలూ 
నీచెవిలో నవ్విన ప్రతిసారీ
పక్కపక్కనే నడిచే మనసులు
నదిపరుగులా నీదైన భావనే 

నువ్వు విస్తరించిన కాంతి 
మనసు ప్రకాశంలో నిన్ను కళాత్మకంగా దిద్దినట్టు
ఎదిగిన క్షణాలు 
ఎదుర్కోలేని క్షణాల పంజరం తలపుల తలుపులను తీసి నిను పరిపరివిధాల పథికుణ్ని చేస్తుంది

ఇమిడిపోయిన ఒక రహస్యమేదో 
మేధను మధింపుకూ 
నడత దిద్దుబాటుకూ 
పిడికిట పెట్టే కారణమైనట్టు
ఇప్పుడన్నీ కొత్త పాఠాలే

హృదయ కవాటం విచ్చిన ప్రతిసారి 
కలల లాంతరు పట్టుకొని
ఆశల వాకిట నిలబడతావు

తరుణం కనురెప్పల అంచున దాటిన 
చంచలత్వమై వెనుదిరిగినప్పుడు 
మౌనం నేర్చిన కొత్త భాష్యాల శిల్ప కళ అవుతుంది
మనసునీ బుద్ధినీ దాటి
వయసు పరిధి దాటి
గతం నుంచి
గతి నుంచి
ఆగని ఈ పయనానికి
ఆగిపోయిన ఆ చైతన్యానికి 
అనాది సంబంధమే 

నీదైన అయోమయంలో 
వెలుగు దొరకని ఏకాంతంలో
అలల ధాటికి తెగిన పడవలా
ఆలోచనల వ్యూహాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే
దాటవేతలు 
దరిచేరే ప్రయత్నాలుగా అవసరాలవుతుంటాయి 

వదిలి వచ్చిన అబద్ధాలు 
వదలలేని మమకారాలు 
కల్లోల లోయలో పడవేస్తుంటే
అనుకూలతల తెడ్డు కోసమే నీదైన తపన అనుకున్నప్పుడు
కడలి నీకనుపాప లోతులలో 
నిత్య సమరపు నీటి బింబమై కనిపిస్తుంది
ఎవరికోసం ఈ ఎదురీతనో ....!!?