Asianet News TeluguAsianet News Telugu

నిరంతర ఉద్యమజీవి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ : ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి

జనగామలోని వీవర్స్ కాలనీలో డాక్టర్ ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ అధ్యక్షతన సర్వోన్నత భారతీయ సంవిదాన్ ఆధ్వర్యంలో బాపూజీ 107 జయంతి వేడుకల సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. 
 

konda laxman bapuji 107th birth anniversary celebrations at jangaon
Author
First Published Sep 27, 2022, 8:23 PM IST

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ  తన చివర శ్వాస వరకు ఉద్యమాలే ఊపిరిగా సాగి దక్షిణాది బాపూజీగా కీర్తినొందారని, వారి ఆశయాలను, చరిత్రను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి, ఉపన్యాస కేసరి ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.  ఇవాళ జనగామలోని వీవర్స్ కాలనీలో డాక్టర్ ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ అధ్యక్షతన సర్వోన్నత భారతీయ సంవిదాన్ ఆధ్వర్యంలో బాపూజీ 107 జయంతి వేడుకల సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ బాల్యం నుండి కొండా లక్ష్మణ్ సామాజిక చైతన్య భావాలను కలిగి ఉన్నారని అన్నారు. విద్యార్థి దశ నుండి చివర శ్వాస వరకు ఎనబై సంవత్సరాల కాలం జాతీయ ఉద్యమం మొదలుకొని, నైజాం విముక్త పోరాటాలు, ముల్కీ ఉద్యమం, తెలంగాణ తొలిదశ, మళిదశ ఉద్యమాలలో కీలక పాత్ర పోశించారని వెంకటరెడ్డి ప్రశంసించారు. 

ఆర్యసమాజ్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, హిందూ లీగ్ వంటి సంస్థల ద్వారా బాపూజీ పోరాడిన విషయాలను ఆయన కొనియాడారు. ఆదిలాబాద్ వాంకిడి కుగ్రామంలో జన్మించినప్పటికి స్వతహాగా అభ్యుదయ భావాలతో పదిహేడేళ్ల వయసులో గాంధీని కలిసిన ఘనత ఆయనదేనని కసిరెడ్డి పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని కలిసి వారి స్పూర్తితో నిజాంపై సాయుధ పోరాటానికి కృషిచేశారని, బాంబు దాడికి ప్రణాళిక వేశారని గుర్తుచేశారు. ఏడో నిజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని చెప్పారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఒక మంత్రిగా కేబినెట్ సమావేశంలో తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారని కసిరెడ్డి గుర్తుచేశారు. బాపూజీ జీవితంలోని కీలక అంశాలను ప్రస్తావించారు.

డాక్టర్ మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ట్యాంకు బండ్ మీద ఏర్పాటు చేయాలని, ప్రతీ జిల్లా కేంద్రంలో విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జలదృశ్యం స్థలంలో  కొండా లక్ష్మణ్ స్మారక భవనం నిర్మాణం చేయాలని కోరారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బాపూజీ పేరిట సాహిత్య, సాంస్కృతిక పురస్కారం ఏర్పాటు చేయాలని కోరారు. చేనేత సహకార సంఘాల నిర్మాణంలో నిజాం ప్రభుత్వ కాలం నుండి ఎంతో కృషి చేశారని వారి చరిత్ర భావితరాలకు అందించేందుకు పాఠ్య పుస్తకాలలో బాపూజీ చరిత్రను పాఠ్యాంశంగా ఉంచాలని మోహన్ కృష్ణ డిమాండ్ చేశారు.

ఈ సభలో తెలంగాణ విద్యా వంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు కోడం కుమారస్వామి, జనగామ రచయితల సంఘం అధ్యక్షుడు అయిలా సోమనర్సింహ్మాచారి, కవులు కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు గుడికందుల కృష్ణ, కవిహృదయం సాహిత్య వేదిక అధ్యక్షుడు పెట్లోజు సోమేశ్వరాచారి, స్థానిక వార్డు కౌన్సిలర్ గుర్రం భూలక్ష్మీ, చేనేత సహాకార సంఘం అధ్యక్షుడు గుర్రం నాగరాజు, నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవ కమిటీ అధ్యక్షుడు మాచర్ల బిక్షపతి, ఉత్సవ సమితి పట్టణ అధ్యక్షుడు అంబటి బాలరాజు, పద్మశాలీ సంఘం నేత గుమ్మడవెల్లి సత్యనారాయణ, తెరసం అధ్యక్షుడు పానుగంటి రామ్ముర్తి, శ్రీశ్రీ కళావేదిక ప్రభాకర్, పొట్టబత్తిని భాస్కర్, ఎనగందుల కృష్ణ, ఘనపురం ఉమేష్, వంగా వెంకట్, సుదర్శన్, సదన్ రావ్, కొంతం శ్రీనివాస్  మరియు జనగామ జిల్లా నుండి అనేక మంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, చేనేత కార్మికులు, పద్మశాలీ సంఘ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios