చివరి రోజుపై చెరగని సంతకం: విల్సన్ రావు కొమ్మవరపు కవిత

నెత్తుటి చమురుతో తడిసిన దేహపు వత్తిని మరోసారి ఎలా వెలిగిస్తున్నారో విల్సన్ రావు కొమ్మవరపు కవిత  "చివరి రోజుపై చెరగని సంతకం " లో చదవండి.
 

kommavarapu wilson rao telugu poem

చివరి రోజుపై చెరగని సంతకం

"ఇప్పుడు మనిషే 
చెట్టులా చరిత్ర సృష్టిస్తున్న కాలం కదా!"
          *     *
నేను లేకున్నా ఊపిరితో నిండిన నా చూపో
ఇక్కడి మట్టి పరిమళాన్ని పీల్చుకున్న నా గుండెకాయో
ఆత్మీయుల మధ్య
మళ్ళీ లయగా కదులుతుంటే
అంతకన్నా మించినదేముందని
మొన్న నాలో మొలుచుకొచ్చిన ఆలోచన...

ఎన్ని బాధల మధ్య నిటారుగా నిలబడ్డానో
ఎన్ని కష్టాల మధ్య కాలంతో పోటీ పడ్డానో
ఇప్పుడు మరణాన్ని అబద్ధం చేస్తూ
చచ్చినా బతకడం గొప్ప కదూ! అంటూ 
నిన్న నాలో మొలుచుకొచ్చిన ఆలోచన...

చావును ధిక్కరిస్తూ
ఇంకాస్సేపటిలో మరో చోట ఉదయించి
స్పర్శానుభూతిలో  పరవశిoచడం గొప్పే కదా! అంటూ 
నేడు నాలో మొలుచుకొచ్చిన ఆలోచన...

ప్రవాహం వెనుదిరిగి పోవడం
ఎప్పుడైనా,ఎవరిమైనా చూసామా!

నా దేహ దేశంలోని ప్రతి అవయవమూ
పౌరుషం నింపుకున్న వ్యవస్థలే!

నెత్తుటి చమురుతో తడిసిన దేహపు వత్తిని
మరో జీవితం కోసం ప్రాణ వాయువును చేస్తాను
నేను నేనుగా నాలుగు దేహాలై
నాలుగు జీవితాలు సంచరిస్తాను...

చెట్టులా పచ్చగా నిలిచేందుకైనా
మట్టిని పచ్చగా నిలిపేందుకైనా
నలుగురి కోసం పూలుగానో, పళ్ళుగానో
రాలిపోతాను...

మాటలు తడబడుతున్న వయస్సులో
నిష్క్రమణ తప్పనప్పుడు
నిష్క్రియా నిశ్శబ్దం కావడమెందుకు..?
చివరి రోజుపై చెరగని సంతకాన్నై గర్వంగా గెలుపునౌతాను...

కేవలం బ్రతుకు కాదు
ఒక ప్రాణ ప్రతిష్ఠ అవయవ దానం
ఆత్మ మరోసారి గర్భగుడిగా మారడం…

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios