నివాళి: జనగామ అభ్యదయకవి రుద్రశ్రీ

రుద్రశ్రీ శుక్రవారం కన్నుమూశారు. భావవాద కవిగా మొదలయిన రుద్రశ్రీ క్రమంగా సాహిత్య ఉద్యమాల ప్రభావంతో అభ్యుదయ కవిగా తన ప్రస్థానం కొనసాగించారని కోడం కుమారస్వామి తన నివాళి వ్యాసంలో అంటన్నారు. 

Kodam Kuamra swami writes on poet Rudrasri

తెలుగు సాహిత్యంలో తనదైన ముద్రవేసుకున్న ప్రముఖకవి, రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ చిట్టిమల్లే శంకరయ్యగారు(87) ఈ శుక్రవారం ఉదయం జనగామలోని ఆయన స్వగృహంలో కన్నుమూసారు. చాలా రోజులుగా మంచానికి పరిమితమై తన జ్ఞాపకాలను కోల్పోయి అచేతన స్థితిలో కుటుంబ సభ్యుల సేవలు పొందారు.  జనగామ పట్టణానికి చెందిన చేనేత, ఆయుర్వేద వైద్యుల కుటుంబంలో  చిట్టిమల్లె వెంకటయ్య, మహాలక్ష్మి దంపతులకు 15 ఏప్రిల్, 1934 న జనగామలో జన్మించారు.  

ప్రాధమిక పాఠశాల విద్య జనగామలో పూర్తి చేశారు. ఉన్నత, స్నాతకోత్తర విద్యను హన్మకొండ, హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. 1972 నుండి జనగామలోని ఆంధ్ర భాషాభివర్దిని డిగ్రీ కాలేజీలో తెలుగు అధ్యాపకులుగా పనిచేసి 1996లో పదవీ విరమణ చేశారు. తెలుగు సాహితీ సాంస్కృతిక రంగంలో రుద్రశ్రీగానే  ప్రపంచానికి సుపరిచితుడు. 2006లో "శ్రీశ్రీ కవిత్వం- ప్రాచ్యపాశ్చాత్య ప్రభావం" మీద నా ఎం.పిల్  పరిశోధన కోసం వెళ్లినప్పుడు, సైన్స్ విద్యార్దివి, శ్రీశ్రీ సముద్రంలో దూకావు మునిగిపోకుండా ఈది బయటపడాలని పలు సలహాలు సూచనలు చేశారు.  తన విద్యార్థి తెలుగు సాహిత్యం వైపు నడవటం పట్ల హర్షం వ్యక్తం చేసి అభినందించడం మరపురాని సందర్భం.

తెలుగు సాహిత్యాన్ని ఆయుర్వేదం కోణంలో విశ్లేషణ, పరిశోధన చేసిన సాహిత్య విమర్శకులు రుద్రతోపాటు  1954 నుండి సాహిత్య రంగంలో పనిచేస్తూ విశేషమైన సాహితీ సృజనలు చేశారు. వీరు రాసిన 'అరాత్రికం', ఇంద్రచాపం, విశ్వసుందరి, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్, అమృత బిందువు, రూపాయి ఆత్మకథ, ప్రేమగజళ్లు, కవితా సంపుటాలు, "పంచామృతం" (గేయనాటికలు)ప్రచురించారు. అదేవిధంగా ముత్యాల సరాల మహాకవిగురజాడ(విమర్శ)తోపాటు 'తెలుగు సాహిత్యంలో దేశీయ వైద్యం' అనే అంశం మీద ఎం.ఫిల్. పరిశోధన గ్రంథం రచించారు.

Kodam Kuamra swami writes on poet Rudrasri

"ఆంధ్ర సాహిత్యంలో ఆయుర్వేదం" అనే అంశం మీద పి.హెచ్.డి. సిద్దాంత గ్రంథం రాశారు.  భావవాద కవిగా మొదలయిన రుద్రశ్రీ క్రమంగా సాహిత్య ఉద్యమాల ప్రభావంతో అభ్యుదయ కవిగా తన ప్రస్థానం కొనసాగించారు. మూడేళ్ల క్రితం అప్పటి జరసం అధ్యక్షుడు పెట్లోజు సోమేశ్వరాచారి, ఆర్క్యూబ్, నక్క సురేష్, పొట్టబత్తిని భాస్కర్ ఆధ్వర్యంలో జనగామ రచయితలంతా కలిసి రుద్రశ్రీ సాహిత్య కృషికి తెలిపిన అభినందనల జ్ఞాపకాలపూలమాల తడిఇంకా ఆరనేలేదు.  

నేను వ్యక్తిగతంగా కలవడానికి 5, ఫిబ్రవరి 2020న రుద్రశ్రీ గారింటికి వెళ్లాను. ఆయన పూర్తి అచేతనంగా ఉన్నారు. సర్ అని పిలిస్తే పలకలేదు. మాట్లడటానికి విఫల ప్రయత్నం చేశాను. వారి సతీమణితో మాట్లాడి వచ్చాను. 80 ఏళ్ల వృద్దాప్యంలో ఆ అమ్మ కనిపించారు.  డాక్టర్ గుర్రం జాషువా, ప్రొఫెసర్ సి.నారాయణ రెడ్డి, మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్.గోపి, మాజీ కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు పొతుకూచి సాంబశివరావు, మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంగిశెట్టి లక్ష్మీ నారాయణ, డాక్టర్ లింగంపల్లి రామచంద్రం, డాక్టర్ కందుల సత్తయ్త వంటి ప్రముఖులతో కలిసి సాహిత్య కృషి చేసిన రుద్రశ్రీ సాహితీ కృషిని నవతరం రచయితలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. సాహిత్య బోధన, సునిశితమైన పరిశీలన, పరిశోధనే అభిరుచి, ఆసక్తిగా నిండు జీవితం గడిపిన చిట్టిమల్లె శంకరయ్య(రుద్రశ్రీ)గారికి  జనగామ రచయితల సంఘం జోహార్లు అర్పిస్తోంది.

- కోడం కుమారస్వామి

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios