కవి యాకూబ్ కు మఖ్దూమ్ మొహియుద్దీన్ జాతీయ అవార్డు

ప్రముఖ కవి యాకూబ్ ప్రతిష్టాత్మకమైన మఖ్దూమ్ మొహియుద్దీన్ జాతీయ అవార్డును అందుకోనున్నారు. తెలుగు సాహిత్యంలో పేరెన్నిక గన్న విమర్శకుడు, కవి యాకూబ్.

Kavi Yakoob gets Makhdoom Mohiyuddin national award

మహాకవి మఖ్దూమ్ మొహియుద్దీన్ పేరిట నెలకొల్పిన 'సిటీ కాలేజ్ మఖ్దూమ్ మొహియుద్దీన్ నేషనల్ అవార్డు' ప్రముఖ కవి, విమర్శకులు డా. యాకూబ్ కు ప్రధానం చేస్తున్నారు.  ఈ ప్రదానోత్సవ సభ రేపు అనగా16-9-2021 (గురువారం) ఉదయం 10.30 గం.కు గ్రేట్ హాల్, ప్రభుత్వ సిటీ కళాశాల (స్వయంప్రతిపత్తి) నయాపూల్, హైదరాబాద్ లో డా. పి బాలభాస్కర్ ప్రిన్సిపాల్, సిటీ కాలేజి సభాధ్యక్షతన జరుగుతుంది. 

ఈ సభకు ముఖ్య అతిథిగా  ఆచార్య డి. రవీందర్ వైస్ ఛాన్సలర్,  ఉస్మానియా విశ్వవిద్యాలయం, విశిష్ట అతిథిగా కె. శివారెడ్డి సుప్రసిద్ధ సాహితీవేత్త, సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత , ఆత్మీయ అతిథిగా  యన్. శంకర్  ప్రముఖ సినీ దర్శకులు పాల్గొంటున్నట్టు సిటీ కాలేజీ మఖ్దూమ్ మొహియుద్దీన్ నేషనల్ అవార్డు కమిటీ నిర్వాహకులు డా. విప్లవదత్ శుక్లా, డా. కోయి కోటేశ్వరరావులు ఒక ప్రకటనలో తెలిపారు.

యాకూబ్ తెలుగు కవిత్వంలోనూ సాహిత్య విమర్శలోనూ విశేషమైన కృషి చేశారు. కవులను ప్రోత్సహించే ఉద్దేశంతో చాలా కాలంగా కవిసంగమం ఇంటర్నెట్ సాహిత్య గ్రూప్ ను నిర్వహిస్తున్నారు. యూట్యూబ్ చానెల్ ను కూడా నిర్వహిస్తున్నారు. ఆయన రారా సాహిత్యంపై ఎంఫిఎల్ చేశారు. తెలుగు సాహిత్య విమర్శ - ఆధునికానంతర ధోరణులపై పిహెచ్ డి పరిశోధన చేశారు. 

యాకూబ్ 1962 మార్చి 2వ తేదీన షేక్ మహమ్మద్ మియా, షేక్ హోరాంబీ దంపతులకు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రొట్టమాకు రేవులో జన్మించారు. ప్రవహించే జ్ఞాపకం, సరిహద్దురేఖ, ఎడతెగని ప్రయాణం, నదీమూలంలాంటి ఇల్లు, తీగలచింత వంటి కవితాసంకలనాలను వెలువరించారు. తెలుగు సాహిత్యంలో లౌకికవాదాన్ని సమర్థంగా ప్రవచించే కవిగా ఆయన పేరు సంపాదించుకున్నారు.  

యాకూబ్ సతీమణి శిలాలోలిత కూడా మంచి కవి, విమర్శకురాలు. ఆమె అసలు పేరు లక్ష్మి. సాహిత్యంలో ఆమె విశేషమైన కృషి చేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios