సాహిత్య శిఖిరం శీలా వీర్రాజు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయనకు నివాళి అర్పిస్తూ కాసుల ప్రతాపరెడ్డి నాళేశ్వరం సంపాదకత్వంలో వెలువడిన శీలా వీర్రాజు లంచిత్రాలు - సాహిత్య వ్యక్తిత్వ విశ్లేషణ గ్రంథం కోసం రాసిన వ్యాసాన్ని యధాతథంగా ఇక్కడ అందిస్తున్నాం...

సాహిత్య శిఖిరం శీలా వీర్రాజు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. అయితే, ఆయన తన రచనల ద్వారా జీవించే ఉంటారు. ఆయన వెలువరించిన సాహిత్యం తెలుగు సాహిత్య లోకానికి దారి దీపంగానే పనిచేస్తుంది. ఆయనకు నివాళి అర్పిస్తూ కాసుల ప్రతాపరెడ్డి నాళేశ్వరం సంపాదకత్వంలో వెలువడిన శీలా వీర్రాజు లంచిత్రాలు - సాహిత్య వ్యక్తిత్వ విశ్లేషణ గ్రంథం కోసం రాసిన వ్యాసాన్ని యధాతథంగా ఇక్కడ అందిస్తున్నాం...

శీలా వీర్రాజు కథలను ఏకబిగిన చదవడం ఒక అనుభూతి. నిజానికి, ఏ రచయిత కథలనైనా ఏకబిగిన చదవడం వల్ల కలిగే అనుభూతి అత్యంత ప్రధానమైందే. అయితే శీలావీ కథలను చదవడంవల్ల కలిగే అనుభూతి అత్యంత ప్రధానమైంది. బుచ్చిబాబును, చలాన్ని, గోపీచంద్‌ను - ఒకరినొకరినే వరుస పెట్టి చదువుతూ హృదయంలోకి ఇంకించుకున్న పాతికేళ్ల తర్వాత శీలా వీర్రాజు కథలు చదువుతుంటే కొత్త అనుభూతి, కొత్త అనుభవం గుండెను ఊపేసింది. ఒక్కొక్క కథనే చదువుతుంటే వ్యక్తుల అంతరంగాల పొరలను దాటుకుంటూ ఒకానొక నిర్దిష్ట కాలంలోని నిర్దిష్ట సమాజం ప్రధాన ద్వారం తలుపులు తెరుచుకుంటాయి.

శీలా వీర్రాజు 1957 నుంచి 1963 వరకు ఒక విడత, 1967 నుంచి 1976 వరకు మరో విడత కథలు రాసినట్లు తెలుస్తున్నది. నిజానికి, మొదటి విడత కథలు రాసిన కాలం బ్రిటిషాంధ్ర సమాజానికి సంబంధించి చాలా ముఖ్యమైంది. మరో రకంగా అదొక సంధి కాలం. ఈ సంధి కాలంలో మానవ ప్రవర్తన, మానవ సంబంధాల వ్యక్తీకరణ, స్త్రీపురుష సంబంధాల తారతమ్యాలు గొప్ప కుదుపునకు గురైన వైనం వీర్రాజు కథల్లో స్పష్టంగా చూస్తాం. అయోమయానికి, అసందిగ్ధతకు కారణమైన సామాజిక మార్పులు ఒక నిశ్చల స్థితికి చేరుకోవడం మనం ఆయన రెండో విడత రాసిన కథల్లో గమనించవచ్చు.

వీర్రాజు కథలు ఆ సమాజం సంఘర్షణ నుంచి కొత్త మార్గాలు తీస్తూ ఆధునికతలోకి ప్రవేశించిన వైనాన్ని కూడా మనకు తెలియజేస్తాయి. అదే సమయంలో మిగతా సాహిత్యం కన్నా శీలా వీర్రాజు కథాసాహిత్యం మనకు కొత్త వ్యక్తిత్వాలు రూపుదిద్దుకుంటున్న తీరునే కాకుండా అవి రూపుదిద్దుకున్న తీరును ప్రత్యేకంగా చూపుతాయి.

రఘుపతి వెంకటరత్నంనాయుడు, వీరేశలింగం పంతుల, చలం స్త్రీ స్వేచ్ఛ, బుచ్చిబాబు వ్యక్తి అస్తిత్వ చింతన, గోపీచంద్ తాత్విక అన్వేషణ, శ్రీపాద వృత్తి మార్పిడుల ప్రబోధాలు, కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ ప్రతిఫలనాలు, గోదావరి కృష్ణా నదులపై ఆనకట్టల వల్ల వ్యవసాయంలో ఒనగూరిన అదనపు సంపద వంటివెన్నో గోదావరి జిల్లాల్లో ఎన్నెన్నో మార్పులు తెచ్చాయి. ఈ స్థితిలో ఆ సమాజం ఆధునికతలోకి అడుగుపెట్టిన సందర్భంలో శీలా వీర్రాజు కథలు వచ్చాయి. ఈ ఆధునికత తెచ్చిన పెనుమార్పులకు యువతరం ఎదుర్కున్న సంక్షోభ సంధి కాలం ఆనయ కథల్లో వ్యక్తమవుతుంది.

నూతన స్త్రీపురుష సంబంధాలు రూపుదిద్దుకుంటున్న దశలో యువతరం తీవ్ర మానసిక సంక్షోభానికి గురి కావడం ఈ కథల్లో చూస్తాం. శ్రీదేవి కాలాతీత వ్యక్తులు నవల కూడా అదే కాలాన్ని ప్రతిఫలిస్తుంది. తెలంగాణ సమాజంలో పురుషులు 1960 దశకంలో అటువంటి సంక్షోభాన్నే ఎదుర్కున్నారు. ఈ సంక్షోభాన్ని తెలంగాణకు సంబంధించి మొట్టమొదట అక్షరబద్దం చేసినవారు బహుశా అంపశయ్య నవీన్. అంపశయ్య నవలలోని రవి పాత్ర ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. స్త్రీపురుష సంబంధాలు ఒక రూపాన్ని సంతరించుకోవడానికి పడిన ఆందోళన వీర్రాజు మొదటి దశ కథలన్నింటిలో వ్యక్తమవుతుంది.

శీలా వీర్రాజు కవి, చిత్రకారుడు కావడం వల్ల కూడా ఆ సంధికాలానికి కవితాత్మకమైన, చిత్రసదృశ్యమైన ఆకృతులను కల్పించారు. ఆనయ కథల్లో కొన్ని చోట్ల కవి లేదా చిత్రకారుడు ప్రొటొగనిస్టు పాత్ర నిర్వహించి మానవ సంబంధాలను అర్థం చేసుకుని, సూత్రీకరించే ప్రయత్నం చేయడం చూస్తాం. కళాత్మకమైన చూపు వల్లనే ఆధునికతలోకి ప్రవేశించడానికి సమాజం పడుతున్న పురుటినొప్పులను ఆయన దృశ్యమానం చేయగలిగారని అనిపిస్తుంది.

ఈ స్థితిలో రూపుదిద్దుకుంటున్న కొత్త మానవ సంబంధాలను ఆహ్వానించే క్రమంలో పాత్రలు తీవ్ర మానసిక సంక్షోభానికి గురి కావడం చూస్తాం. సామాజిక మార్పుల నేపథ్యంలో యువతీ యువకుల మధ్య సంబంధాలు నెలకొనే విషయంలో ఈ సంక్షోభాన్ని గమనించవచ్చు. కలల ప్రపంచానికి, వాస్తవానికి పొత్తు కుదరకపోవడం, మానసిక ప్రవర్తనకు అనుగుణంగా బయటి సంబంధాలను నెలకొల్పుకోవాడనికి సరిపోని వ్యక్తీకరణ మనుషులను అంతర్ముఖత్వంలోకి నెట్టివేస్తుంది.

ఈ అంతర్ముఖత్వం ప్రధాన సూత్రంగా శీలా వీర్రాజు కథలు నడిచాయి. ఈ అంతర్ముఖత్వం ఆనందాన్ని, విషాదాన్ని, మానసిక స్థితిని వ్యక్తం చేయడంలో చోటుచేసుకునే బిడియం, ఈ బిడియం వల్ల లేదా తాము చెప్పకుండానే తమ మనస్సును తమ ఎదుటివారు అర్థం చేసుకోవాలనే కాంక్ష వల్ల యువతీయువకులు పరస్పరం తమ కోరికలను వ్యక్తం చేయకపోవడం గమనిస్తాం. ఇదే సమయంలో పరస్పరం అభిప్రాయాలను వ్యక్తం చేసుకుని తమ సంబంధాలను స్థిరం చేసుకోవడంలో కూడా పాత్రలు అయోమయానికి, గందరగోళానికి, అస్పష్టతకు లోను కావడం చూస్తాం. తమ మనసును అర్థం చేసుకుని ఎదుటివాళ్లు ప్రవర్తించాలనే కోరిక అంతర్లీనంగా వుండి, బయటకు చెప్పుకోలేకపోవడం చూస్తాం.

దీనివల్ల ఆశించిన పురుషుడితో లేదా స్త్రీతో సంబంధాలను శాశ్వతం చేసుకోలేని పరిస్థితిలో చాలా పాత్రలు తమలోకి తామే ముడుచుకుపోవడం, తాము కోరుకున్నది జరగనప్పుడు ఆ పాత్రలు నిరసనకు దిగడం, ఆ నిరసన ఆత్మహనన మార్గంలో కొనసాగడం చూస్తాం. అది సమాజంపై నిరసనే అయినప్పటికీ ఆత్మవిధ్వంసం దారిలో సాగడడం ఈ సంధికాలం ప్రత్యేకత.

భౌతిక ప్రపంచానికి, మానసిక ప్రపంచానికి మధ్య పొత్తు కుదరకపోవడం వల్ల తలెత్తే సంక్షోభం అది. భౌతిక ప్రపంచం కట్టుబాట్లకు, అవసరాలకు అనుగుణంగా నడుచుకుంటూనే తమ కలలను కూడా సాకారం చేసుకోవాలని తపనపడే పాత్రలను శీలా వీర్రాజు కథల్లో చూస్తాం. రెండు కన్నీటి చుక్కలు - ఒక్క ప్రశ్న అనే కథలో పాపారావు అనే పాత్ర గురించి చెబుతూ రచయిత మరీ మంచి మనుషులు మానసికంగా బలహీనులైతే, యితరుల మీద పగ సాధించుకోవడం సాధ్యం కానప్పుడు తన మీద తానే పగ సాధించుకుంటారు అని చేసిన వ్యాఖ్యను ఇక్కడ పరిగణనలోకి తీసుకోవచ్చు.

నిజానికి, శ్రీలా వీర్రాజు కథల్లోని అన్ని పాత్రలూ మంచివే. కావాలని చెడు పనులు చేసే పాత్రలు మనకు కనిపించవు. పరిస్థితుల ప్రాబల్యం వల్ల, తాము పొందదలుచుకున్నవాటిని పొందడానికి చేసే ప్రయత్నం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో చేసే పనుల వల్ల ఇతరులకు నష్టం జరుగుతూ ఉంటుంది. దానివల్ల తమ పక్కవారు నష్టపోతారనే విషయాని కన్నా తాము కావాలనుకున్నదాన్ని పొందడమే ఆ పాత్రలకు ప్రధానమవుతుంది. దీనివల్ల నష్టపోయిన పాత్రలు నిరసనను వ్యక్తం చేయడానికి తమను తాము హింసించుకునే మార్గాన్ని ఎన్నుకుంటే, విజయం సాధించిన పాత్రలు ఆధునికతలో ముందుకు సాగిపోతుంటాయి. కొత్త పరిస్తితుల్లో కొత్త రకం ప్రేమలు, స్నేహాలు, ఉపాధి అన్వేషణలు, ఉపాధి అన్వేషణల్లో వలసలు ముందుకు వచ్చాయి. ఈ నూత్న పరిస్థితులను ఆలంబనగా చేసుకుని సమాజంలోని మార్పులను, ఆ మార్పులకు అనుకూలంగా తమను తాము మలుచుకోవడానికి మనుషులు పడే మానసిక, భౌతిక సంక్షోభాన్ని శీలా వీర్రాజు తన కథల్లో చిత్రీకరించారు.

సమాధి కథాసంకలనంలోని విచిత్రత్రయం, సమాధి, ఉగాది కథలను పక్కన పెడితే అస్థిపంజరం కథనుంచి మొదలు పెట్టి పగా మైనస్ ద్వేషం కథా సంకలనంలోని టైటిల్ కథను మినహాయిస్తే పొడి మేఘం - పెనుగాలి కథ వరకు రచయిత గోదావరి జిల్లాల యువతరంలో నెలకొన్న మానసిక సంక్షోభానని, దానివల్ల తలెత్తిన పరిణామాలను, ఆధునికతను అందుకోవడంలో వెనుకబడిన యువతీ యువకులు ఆత్మహననం దిశగా సాగడాన్ని చిత్రీకరించారు. అస్థిపంజరంలో కోయపిల్ల విచిత్ర మరణం మొదలుకొని పొడిమేఘం - పెనుగాలిలోని నర్సు నాగమణి పాత్ర బలవన్మరణాన్ని ఆహ్వానించడం వరకు ఈ స్థితిని చూస్తాం. మధ్య తరగతి ఆవిర్భవించి, సమాజంలో సర్దుకుపోవడానికి పడిన బీభత్స, భయానక స్థితి ఈ కథల నిండా పరుచుకుని వుంటుంది.

శీలా వీర్రాజు కథలు రాయడం మొదలు పెట్టేనాటికి కమ్యూనిస్టు, జాతీయోద్యమాల పాత్ర ముగిసింది. బలమైన రాజకీయ, సామాజికోద్యమాలు లేని సంధి దశ అది. కమ్యూనిస్టు ఉద్యమ పరిస్థితులకు తగిన ఆచరణను ఎన్నుకోవడంలో విఫలం కావడం వల్ల రాజకీయ ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు పైకి కనిపించేంత ఉధృతంగా లేని కాలం ఇది. ఇటువంటి కాలంలో సామాజిక చలనం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. సమాజం ఒక స్తబ్దతకు గురైన భావన కలుగుతుంది. కానీ అప్పటి వరకు జరిగిన ఉద్యమాల వెల్లువ వల్ల సంభవించిన మార్పులకు అనుగుణంగా సమాజం ఏదో ఒక వైపు సర్దుకునే ప్రయత్నంలో ఆ చలనం కొనసాగుతుంది. ఈ చలనం మానవ జీవితాలు నూతన పరిస్థితులకు అనుగుణంగా కుదురుకోవడానికి ఉపకరిస్తుంది.

అయితే నూతన సమాజంలోని మార్పులను అందుకోలేనివారు తీవ్రమైన నిరాశకు, మానసిక సంక్షోభానికి గురి కావడం, తత్ఫలితంగా వెనకబడిపోవడం, ఆ వెనకబాటను భరించలేక నష్టపోయామనే భావనకు గురై ఆత్మహత్యా సదృశ్యమైన ఆచరణలకు పూనుకోవడం చూస్తాం. ఈ రకమైన సంక్షోభాన్ని పట్టుకోవడం సామాజిక శాస్త్రవేత్తలకు కష్టమైన పని. సృజనాత్మక రచయితలు మాత్రమే వాటిని పట్టుకుని అక్షరీకరించగలరు. ఆ పని వీర్రాజు చేశారు.

పగా మైనస్ ద్వేషం సంకలనంలోని రెండు దార్కలుకీ మలుపు ఒకటే కథతో ఈ కొత్త తరం ఒక స్పష్టతకు వచ్చి సర్గుకుపోవడానికి చేసే ప్రయత్నానికి పాదులు పడడం చూస్తాం. ఈ కథలో ప్రేమ వైఫల్యంతో జీవితంలో దొంగలా తప్పించుకు తిరగటం నేర్చుకున్న సుధాకరం, స్నేహితురాలు దయ ప్రబోధంతో తన జీవితాన్ని సర్దుకుంటాడు. జీవితంలో కోరుకున్నవన్నీ దొరక్కపోవచ్చు. కాని, ఎప్పుడూ దాన్ని తలుచుకుంటూ జీవితం పొడవునా బాధపడడం మంచిది కాదు. బస్సు రాకపోవడానికీ, కాఫీ సహించకపోవడానికీ - యిటువంటి అతి మామూలు చిన్న చిన్న విషయాలకు కూడా ఓటమినే గుర్తు చేసుకుని, దాన్నే అన్వయింపజేసుకోవడం తెలివిలేనివారు చేసే పని. ఎందుకంటే నిరాశ, జీవితాన్ని ఎందుకూ పనికి రాకుండా చేస్తుంది. అది ఉప్పు నీటి లాగ జీవితాన్ని చౌడు దేరుస్తుంది. ఏ సారమూ లేకుండా బతికేవారు తమకే గాక యితరులకి కూడా ఎందుకూ ఉపయోగించరు. అని స్నేహితురాలు చేసిన ప్రబోధం అతన్ని పూర్తిగా మార్చి వేసింది. దాంతో ఆధునికతను అందుకునే ప్రయత్నంలో విజయం సాధించి కొత్త సంబంధాలను ఆహ్వానించే స్థితికి చేరుకుంటాడు.

ఈ క్రమంలో మరొకరి చేతిలో మోసానికి గురైన దయను తన జీవితంలోకి ఆహ్వానించేంతగా అతను పరిణామం చెందుతాడు. అయితే సుధాకరం జీవితాన్ని మార్చేసే ప్రబోధం చేసిన దయ దాన్ని ఆహ్వానించలేకపోతుంది. ఈ విషయంలో పురుషులు స్త్రీలకన్నా ముందున్న విషయాన్ని, ముందుంచడానికి గల చారిత్రక సామాజిక పరిస్థితులను రచయిత సూచించాడని చెప్పవచ్చు. ఒక తరం పడిన మానసిక, సామాజిక సంక్షోభానికి ఈ కథలో తెర దించారు. ఆయనకు సామాజిక చలనసూత్రాలను, అవి తీసుకునే మలుపులకు సంబంధించి పూర్తి అవగాహన ఉన్న విషయాన్ని కథల పరిణామక్రమం తెలియజేస్తుంది.

వాళ్ల మధ్య వంతెన కథా సంకలనంలోని నీడపట్టు మనిషి కథ నుంచి శీలా వీర్రాజు కథలు మధ్యతతరగతి తమ తమ జీవితాల్లో సర్దుకుపోవడానికి, తమకు కావాల్సిందేమిటో గుర్తించి అనుసరించడానికి పూనుకున్న వైనాన్ని చిత్రించారు. గోదావరి జిల్లాల్లోని ఒక తరం స్పష్టతకు వచ్చిన విషయాన్నిన ఇక్కడ మనం గుర్తించవచ్చు. స్వాతంత్ర్యోద్యమానికి ముందు ప్రారంభమైన కమ్యూనిస్టు ఉద్యమం స్వాతంత్ర్యానంతరం రాజకీయ చలనశీలతను కోల్పోయిన దశలో శీలా వీర్రాజు ఆ కథలు రాశారని అనుకోవడానికి వీలుంది. అభ్యుదయ సాహిత్య ప్రయోజనం తీరిపోయి కోస్తాంధ్ర మధ్యతరగతిని సామాజిక కార్యాచరణకు పురికొల్పే ఆదర్శ ఉద్యమాలు ఎవీ లేని సంధి కాలానికి సంబంధించిన సంక్షోభమంతా మొదటి దశ కథల్లో కనిపిస్తుంది.

పరిణామాలు ఒక కొలిక్కి వచ్చి విప్లవ రచయితల సంఘం (విరసం) ఏర్పడడం బహుశా ఈ స్పష్టతకు కారణం కావచ్చు. ఆ స్పష్టత కేవలం రాజకీయ ఉద్యమాల విషయంలోనే కాకుండా మనుషుల వ్యక్తిగత జీవితాల్లోనూ కనిపిస్తుందనడానికి శీలా వీర్రాజు తర్వాతి కథలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. జీవితంలో ఆదర్శప్రాయంగా ఉండడం, ఇతరులను సంక్షోభం నుంచి బయటపడవేయడం ఈ కథల్లో చూస్తాం. కథ నాదీ - ముగింపు ఆమెదీ అనే కథ ఇందుకు మంచి ఉదాహరణ.

ఏటి పాలైన యవ్వనం, జ్వాల వంటి కొన్ని కథలను మినహాయిస్తే మిగతా కథలన్నీ ఈ విషయాన్ని తెలియజేస్తాయి. చలం స్త్రీ స్వేచ్ఛావాదాన్ని, బుచ్చిబాబు అస్తిత్వ వేదనను, గోపిచంద్ తొలి దశ హేతువాద దృక్పథాన్నిన కలగలుపుకొని భాతిక ప్రపంచం దారులను వెతుక్కునే మనుషులను ఈ కథల్లో ఆయన పాత్రలుగా ఎంచుకున్నారు. తొలి కథల్లో పాత్రలు విపరీతమైన భావుకతకు లోనుకావడం, కలల ప్రపంచానికి ప్రాధాన్యం ఇవ్వడం, వాటిని సాకారం చేసుకోలేక యాతన పడడం కనిపిస్తుంది. ఆ భావుకత కొంత మేరకు తగ్గి భౌతిక వాస్తవికతను చిత్రించే దిశగా ఆనయ కథా రచన సాగడం గమనిస్తాం. కాముడు కాలిపోయాడు వంటి కథల్లో ఒక స్త్రీ ప్రేమను నిరాకరించి, మరో స్త్రీ ప్రేమను స్వీకరించడంలో కూడా ఈ భౌతిక ప్రపంచానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యాన్ని చూడగలం.

తొలి కథల్లో ప్రకృతికీ, స్త్రీకీ మధ్య అభేదంతో శీలా వీర్రాజు కథారచన సాగింది. స్త్రీపురుష సంబంధాలను మానవ సమాజాన్ని, ప్రకృతిని చాలా కథల్లో ఒక చిత్రకారుడి దృక్పథంతోనో, కథారచయిత దృష్టికోణంతోనో ఆయన పరామర్సించారు. ప్రకృతిని చూసి అనుభవించినట్లుగానే, అందమైన స్త్రీని కూడా చూసి అనుభూతి చెందాలనే భావన ఆయన కథల్లో వ్యక్తమవుతుంది. ఒక రకంగా కథారచనలో అనుభూతికి శీలా వీర్రాజు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆ తర్వాతి కథల్లో స్త్రీపురుషులను భౌతిక ప్రపంచంలో సమానులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారు.

శీలా వీర్రాజు మధ్యతరగతి భావుకత్వాన్ని, కలల ప్రపంచాన్ని, మానవ సంబంధాలను చిత్రించారు. కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించి ఒకే ఒక కథ చూస్తాం. అది కూడా కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిన యువతి, తర్వాత సాధారణ జీవితంతో రాజీ పడడం చూస్తాం. రాజీ పడడమే కాకుండా తన పేదల అనుకూల వైఖరిని విడనాడడం కూడా గమనించవచ్చు. కమ్యూనిస్టు ఉద్యమంలోని చాలా మంది వ్యక్తులు తమ ఆదర్శరూపాలను కోల్పోయి సాధారణ మానవ స్వభావాలను సంతరించుకోవడం ఇప్పటికీ గమనిస్తున్న విషయమే. నీడ కథలో కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చిన చందనం సాధారణ స్త్రీ స్థాయికి కుదించుకుపోవడాన్ని రచయిత ప్రతిభావంతంగా చిత్రించారు. అంతేకాకుండా శీలా వీర్రాజు స్త్రీప్రాంపిచక సమస్యలపై దృష్టి మళ్లించిన పరిణామానికి కూడా ఈ కథ అద్దం పడుతుంది.

ఈ రకంగా శీలా వీర్రాజు ఒక నిర్దిష్ట సామాజిక మార్పును నిర్దిష్ట కాలయవనికపై ప్రదర్శించారు. నిర్దిష్టత సార్వజనీనతను సంతరించుకున్న తీరుకు శీలా వీర్రాజు కథలు మంచి ఉదాహరణగా నిలుస్తాయి. మానవ ప్రవర్తనను రాగద్వేషాలకు అతీతంగా చిత్రించడం వల్ల కూడా కథలు సార్వజనీనతను సంతరించుకున్నాయని భావించవచ్చు. కథల్లో చిత్రకారులు, కథా రచయితలు, కవులు కనిపించినప్పటికీ ఏ పాత్ర మీద కూడా రచయిత నీడ పడలేదు. రచయిత జోక్యం లేకపోవడం పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసింది. ఆయన కథల్లోని పాత్రలు పాఠకుల ముందు నిలబడి తమను తాము వ్యక్తీకరించుకుని, ప్రదర్శించుకుని వెళ్లిపోతూ ఉంటాయి. మొత్తంగా శీలా వీర్రాజు మధ్యతరగతి సమాజాన్ని మనకు దృశ్యమానం చేశారు.