కందాళై రాఘవాచార్య కవిత : తెర తీయగ రాదు ??
తెర తేటతెల్లం కాదు తెర తీయగ రాదు వఠ్ఠి తెర ముందు మనిషి కట్టేసిన బొమ్మై పోతాడు అంటూ కందాళై రాఘవాచార్య రాసిన కవిత ' తెర తీయగ రాదు ?? ' ఇక్కడ చదవండి :
ఏ మచ్చ లేని తెల్లని తెర !
ఆట మొదలైదంటే ఆగేదే లేదు
ఎన్నెన్ని షోలో
తెర మీదే మనుష్యులు !
తెర మీదే ఉన్మాదం !
తెర మీదే ఆకాశమంత మంటలు !
బాంబులాటలు !
నాయకి నాయకుల వాన పాటలు
తలలు నరకటం నాయకత్వం !!
తెర ఎర్ర చందనం అద్దకం !
పిల్లలు చూడకూడని దృశ్యాలు !
ఏమీ లేని తెర మీద ఏమేమో ?
దృష్టి మరల్చనీయని ప్రపంచ పాశవికత
తెరదే రాజ్యం
శుభం అయినా ప్రేక్షకుల వెంట
తెర చిరగకుండా మనసుకు చుట్టుకుని వస్తుంది
రాత్రి పడుకుంటే కంటి మీద అదే తెర
కలలోనూ తెర ఆవిష్కరణ దృశ్యాలే
పైన బడ్డట్టే 3d ఉత్పాతం
మిథ్యా ప్రతిబింబాలైనా
హృదయం మీద నిజ ప్రతిబింబాలే
తెర తేటతెల్లం కాదు
తెర తీయగ రాదు
వఠ్ఠి తెర ముందు మనిషి కట్టేసిన బొమ్మై పోతాడు
ఇంద్రజాలం తెర
బాలలు భవిష్యత్తులో తెర మీది బొమ్మల్లా మారితే !!
జై కిసాన్ ఎక్కడా ?
జై జవాన్ ఎక్కడా ?