ఐ. వీ. సుబ్బాయమ్మ ''పర్వచంద్రిక'' పుస్తక పరిచయం
ఐవీ సుబ్బాయమ్మ రచించిన పర్వచంద్రిక అనే పుస్తక పరిచయ కార్యక్రమం లక్షెట్టిపేటలోని హనుమాన్ మందిరం ఫంక్షన్ హాలులో జరిగింది.
కరీంనగర్: సమాజ హితమే మనిషి అభిమతం కావాలని పుర అధ్యక్షులు నల్మాసు కాంతయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని హనుమాన్ మందిరం ఫంక్షన్ హాలులో జరిగిన ఐ. వీ. సుబ్బాయమ్మ రచించిన పర్వచంద్రిక అనే పుస్తక పరిచయ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహిత్యం సమాజ హితం కోరుకుంటుందనీ, కవులూ, కళాకారులు సమాజాన్ని సన్మార్గంలో నడపడంలో ముందుంటారనీ అలాగే ప్రతి మనిషి కూడా చెడు మార్గాన్ని వీడి మంచిని పది మందికి పంచాలని అన్నారు.
సాహితీ స్రవంతి లక్షెట్టిపేట ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సంస్థ అధ్యక్షులు గోపగాని రవీందర్ మాట్లాడుతూ సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి పట్టణంలో ఒక ఆడిటోరియం నిర్మించాలని కోరగా... శాసనసభ్యుల సహకారంతో తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రముఖ కవి బొల్లవరం జగన్మోహన రావు పుస్తకాన్ని సమీక్షిస్తూ పండుగల వెనుక వున్న పరమార్థాన్ని ఈ తరానికి అర్థమయ్యే రీతిలో చక్కగా వివరించారని రచయిత్రిని కొనియాడారు.
కార్యక్రమంలో సుబ్బాయమ్మ భర్త కిషన్ రావు, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు (సిటీ కేబుల్) శ్రీ చెట్ల రమేశ్ , సంస్థ గౌరవ అధ్యక్షులు కందుల తిరుపతి, ఉపాధ్యక్షులు లేదాళ్ళ రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వేనంక చక్రవర్తి, ప్రచార కార్యదర్శి నూటెంకి రవీంద్ర,మంచిర్యాల నుండి వచ్చిన ప్రముఖ కవులు అల్లాడి శ్రీనివాస్, రాజేశం గౌడ్, నీళాదేవి, భాగ్యలక్ష్మి, సుజాత మరియు స్థానిక కవులు కొండు జనార్థన్, ముత్యం మల్లేశం, గుండ ప్రభాకర్, సలిగంటి మల్లేశ్, సందీప్ ఆర్టిస్ట్, శ్రీమతి రమణశ్రీ, భారతి, జయ, శోభ, ఇంకా సుబ్బాయమ్మ శిష్యులు తదితరులు పాల్గొని రచయిత్రిని అభినందించారు.