గుల్జార్ కవిత: మేల్కొను మేల్కొను మెలకువగా వుండు
ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ తెలుగు కవి వారాల ఆనంద్ గుల్జార్ కవితను తెలుగులో అందించారు. ఆ కవితను చదవండి.
మేల్కొను మేల్కొను మెలకువగా వుండు
‘రాత్రులు’
దాడి చేయడానికి సిద్ధపడ్డాయి
అది ఓ సాలెగూడు
చీకటిని కొంతమంది పెంచి పోషిస్తున్నారు
మేల్కొను మేల్కొను మెలకువగా వుండు
మనుషులూ వాళ్ళ విశ్వాసాలూ
అగ్ని కీలల్లో చిక్కుకున్నాయి
అగ్నికోరలు గర్జించినప్పుడు- భయమేస్తుంది
అవి ప్రజల్ని రెచ్చగొట్టినప్పుడు
మరింత భయంతో వణుకొస్తుంది
‘జాతి’
కొందరి పదఘట్టనల క్రింద
నలిగిపోతున్నది
మేల్కొను మేల్కొను మెలకువగా వుండు
మరోసారి మెడలు వంచబడ్డాయి
తలలు తెగి రాలిపడ్డాయి
ప్రజలూ వాళ్ళ దేవుళ్ళు కూడా
విభజించబడ్డారు
ఎవరయినా పేరేమిటని అడిగితే.. భయమేస్తుంది
ఏ దేవుణ్ణి పూజిస్తావంటే.. మరింత భయమేస్తున్నది
కొందరు చాలాసార్లు నన్ను
మంచెకు వేలాడదీసారు
మేల్కొను మేల్కొను మెలకువగా వుండు .
మూలం : గుల్జార్
అనువాదం: వారాల ఆనంద్