International womens day: యడవల్లి శైలజ ప్రేమ్ కవిత "అంతటా ఆమె"

నేడు అంతర్జాతీయ  మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మం నుండి యడవల్లి శైలజ ప్రేమ్ రాసిన కవిత "అంతటా ఆమె" ఇక్కడ చదవండి.

International womens day: Ydavalli Sailaja prem telugu poem

నిద్ర పొద్దును కళ్ళలోనే కుక్కుకొని
వంగనని మొరాయిస్తున్న నడుమును
విల్లును వంచినట్లు వంచేసి
గీతలు చెరిగిన చేతులను
చాకులు రాసిన రాతలను
ఊదుకుంటూ పసుపు ముద్దను అద్దుకుంటూ
టీ, కాఫీ, టిఫిన్ అందించి
అత్తగారి విరుపులను
మామగారి నొక్కులను
మొగుడి గారి దీర్ఘాలను
గుండెల్లోనే మోస్తూ
భుజానికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని
చేతిలో లంచ్ బాక్స్ తీసుకుని
బడిలో అడుగు పెడుతుంది....

అదేంటో గాని 
నల్లని బోర్డు,తెల్లని సుద్దముక్కని 
చూడగానే ఈ ప్రపంచమంతా
ఆమె చేతిలో ఇముడ్చుకున్నట్లు
భాషైనా భావమైనా లెక్కలైనా
సామాన్య సాంఘీకం ఏదైనా
చికాకులు చింతలు మరిచిపోయి
బుజ్జి మెదడుకు ఎక్కిస్తుంది....

కన్న బిడ్డలు వాళ్ళే
చుట్టాలు స్నేహితులు వాళ్ళే
మంచి చెడులు చెబుతుంది
తప్పు చేస్తే అమ్మలా తిడుతుంది
నాన్నలా ప్రేమిస్తుంది
ఎందుకంటే ....
తొమ్మిది నెలలు మోసి
ఎముకలు విరిగేటంత బాధను భరించి
జన్మనిచ్చిన తల్లి భూదేవి అంతటా ఆమె.....
బడైనా గుడైనా ఆఫీసైనా ఇళ్ళైనా
రెండు భుజాలపై మోయగలదు
తన శక్తిని చాటగలదు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios