Asianet News TeluguAsianet News Telugu

అమ్మకు అక్షర నీరాజనం " జనని శతకం "

ఈనాటి వృద్దాశ్రమాలలో మగ్గుతున్న తల్లుల దయనీయ స్థితిని దూరం చేసే ప్రణవ మంత్రం  " జనని శతకము".  అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా  ఈ శతకం పైన వేదార్థం మధుసూదన శర్మ  చేసిన సమీక్ష ఇక్కడ చదవండి.

international mothers day special... review on janani shatakam
Author
Hyderabad, First Published May 8, 2022, 2:09 PM IST

మాతృదేవోభవ:, పితృదేవోభవ:, ఆచార్య దేవోభవ:, అతిథి దేవోభవ --అని వేదంలో ఉంది. ఇవి మనకు నిత్య స్మరణీయాలు. మొదట మనకు జన్మనిచ్చిన తల్లి దైవంతో సమానం. అంతేకాదు జన్మనిచ్చి, తన సంతానం ఎలాంటి కష్టాలు పడరాదని, వారికి ఏ లోటు రాకుండా చూడాలని తపించే అమృతమూర్తి అమ్మ.  అందుకే ఆమెను దైవంతో సమానంగా చూస్తున్నాం.

అలాంటి అమ్మ గొప్పతనాన్ని  తెలియజేస్తూ, ఎల్లలు లేని ఆమె ప్రేమలోని ఆత్మీయత, అనురాగాలను వ్యక్తీకరించింది  "జనని శతకం".   తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు ప్రముఖ కవయిత్రి,రచయిత్రి  శ్రీమతి రావూరి వనజ గారు రచించిన శతకం ఇది.   వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలిగా ఒకవైపు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూ, మరోవైపు ప్రవృత్తి చేత తెలుగు భాష పై ఉన్న మమకారంతో, తెలుగు పద్యం పై ఉండే ప్రేమతో అటు వచనం లోను, ఇటు పద్యం లోను అనేక రచనలు చేశారు. గతంలో వారు వెలువరించిన శారదాంబ, పూలబాట శతకాలు బహుళ పాఠకాదరణ పొందాయి.  ఇదే స్పూర్తితో అమ్మ యొక్క విశ్వరూపాన్ని చూపెట్టే విధంగా జనని శతకాన్ని వీరు రచించారు.

"అవనిలోన దైవ మగును జనని" అనే మకుటంతో, సరళ భాషలో సుందరమైన శైలిలో, సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో, ఆటవెలది ఛందస్సులో  ఈ శతకాన్ని రచించారు వనజ.  సమస్త సృష్టికి అమ్మే ఆది దైవం. ఆమెకు సాటి మరొకరు లేరు, రారు.  అందరికీ ఆరాధ్య దైవం అమ్మ. జనని ప్రేమ ఎరుగని వారు ఈ లోకంలో చాలా అరుదు.

"ఏమి నోము ఫలమో యెట్టి పూజాఫలమో
మాకు అమ్మయగుచు మహిని వెలసె
అమ్మ కన్న గొప్ప ఆత్మీయులెవ్వారు
అవనిలోన దైవ మగును జనని"

"మాతృమూర్తి యన్న మాతృభాషయు యన్న
మధుర మధురమైన మధువు లొలుకు
నట్టిదేది లేదు యావజ్జగంబులో
అవనిలోన దైవ మగును జనని"---అని అమ్మ గొప్పతనాన్ని వనజ  బహు చక్కగా వర్ణించారు.

"బాధలెన్ని యున్న భరియించి మాయమ్మ
గుండెలోన దాచుకొనెడి దెపుడు
బయట పెట్టకుండ భాసిల్లుచుండెను
అవనిలోన దైవ మగును జనని"--  అని అమ్మ తనకు వచ్చిన కష్టాలను దిగమింగుకుని, తన సంతానము పడే కష్టాలు తనవిగా భావించుకొనే ప్రేమమూర్తి అని ఈ పద్యములో వివరించారు.

అమ్మ చేతి వంట అమృతమయం అని కవయిత్రి ఈ పద్యాలలో గొప్పగా చెప్పారు.

"అమ్మ చేతి వంట అమృత మాయమగును
అమ్మ పిలుపు మిగుల కమ్మదనము
అమ్మ చెంత నున్న నది స్వర్గతుల్యము
అవనిలోన దైవమగును జనని"

"జొన్న రొట్టెయైన జొన్న సంకటియైన
అమ్మ చేయి తాక నదిరిపోయే
అరయ పచ్చి పులుసు అమృతమై దోచెను
అవనిలోన దైవ మగును జనని"

అలాగే మరో పద్యములో అమ్మ ప్రేమ గురించి గొప్పగా  ఇలా వ్యక్తం చేశారు.

"అమ్మప్రేమ యున్న అవని గెల్వగవచ్చు
తల్లి తండ్రి మాట తనయ విన్న
భాగ్యమెంతో కలిగి బాగుగా వెలుగొందు
అవనిలోన దైవ మగును జనని"

ఇలాంటి అమృతమయమైన అమ్మ ప్రేమని పొందలేని వారు అదృష్టహీనులు అని రచయిత్రి  మరో పద్యములో ఇలా తెలియజేస్తున్నారు.

"అమ్మ చెంత నున్న నానంద ముప్పొంగు
అమ్మ ప్రేమ కన్న నమృత మేది
అమ్మ లేని బ్రతుకు అంతయు శూన్యంబు
అవనిలోన దైవ మగుచు జనని".

ఇలా సుందరమైన భావాలను హృద్యముగా ఈ శతకములోని వివిధ పద్యాలలో వివరించారు.

కష్ట మెంత యున్న కన్నీరు పెట్టక, ఏమి చెప్పగలను ఎంతని చెప్పను, పేగు బంధమనగ వెల కట్టలేనిది, మంచితనం నేర్పే మాట నేర్పే, అమ్మ నాన్న కన్న ఆప్తులెవ్వరు లేరు---వంటి వాక్యాలను ప్రయోగించి, శతకాన్ని గొప్పగా తీర్చి దిద్దినారు వనజ.

ఈవిధంగా వీరు ఈ శతకములోని ప్రతి పద్యములో ఏదో ఒక సామెతనో, సూక్తినో, పలుకుబడినో, అలంకారమో, ఉపమానమో ప్రవేశపెట్టి పాఠకులను ఆసాంతం చదివించే విధంగా అద్భుతంగా తీర్చిదిద్దినారు.

ఇందులోని విషయాలు, రచయిత్రి వెలిబుచ్చిన అంశాలు అందరికీ తెలిసినవే అయినా, చెప్పే విధానంలో నవ్యత ఉన్నది. ఈనాటి వృద్దాశ్రమాలలో మగ్గుతున్న తల్లుల దయనీయ స్థితిని దూరం చేసే ప్రణవ మంత్రం ఇది. అమ్మపై ఎన్నో కావ్యాలు, కథలు, సినిమాలు, పాటలు, నాటకాలు, పద్యాలు వచ్చినా ఈ శతకానికి ఉండే ప్రత్యేకత దీనికి ఉంది.  అమ్మను దూరం చేసుకునే వారికి ఇది మేలుకొలుపు.

ఈ జనని శతకాన్ని పిల్లలచే చదివించాలి.  వారికి చిన్నతనంలోనే ఇలాటివి చదివించడం ద్వారా అమ్మ, నాన్న, సోదర సోదరీమణులు మొదలైన బంధాలలోని ఆత్మీయత, అనురాగాల విలువ, మానవ సంబంధాల గొప్పతనం తెలుస్తుంది.

భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అంటారు.  అలాంటి అమ్మకు అక్షర నీరాజనం సమర్పించిన కవయిత్రి రావూరి వనజను అభినందిద్దాం.
 

Follow Us:
Download App:
  • android
  • ios