భాషల ద్వారానే భావజాల వ్యాప్తి - బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ జనరల్ మేనేజర్ 

హైదరాబాదులోని బ్యాంక్ ఆఫ్ బరోడా జోనల్ కార్యాలయంలో మాతృభాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు అధికారులు, సిబ్బంది.. హిందీ, తెలుగు, ఒడియా, బెంగాలీ మొదలయిన తమ తమ మాతృ భాషల్లో ప్రసంగించారు

international mother language day celebrations bank of baroda hyderabad zonal office

భాషల ద్వారానే ఒక తరం నుండి మరో తరానికి ఆలోచనలు, తాత్వికత, భావజాలం, జ్ఞానం వ్యాప్తి చెందుతాయని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ జనరల్ మేనేజర్ మన్మోహన్ గుప్తా అన్నారు. హైదరాబాదులోని బ్యాంక్ ఆఫ్ బరోడా జోనల్ కార్యాలయంలో ఇటీవల  నిర్వహించిన మాతృభాషా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వినియోగదారులకు వారి మాతృభాషలోనే సేవలు అందించడంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ముందంజలో ఉందని ఆయన చెప్పారు. డిజిటల్ సేవలు, ఎస్. ఎం. ఎస్. హెచ్చరికలు మొదలైనవాటిలో మాతృభాషలను వినియోగిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా ఫిబ్రవరి 21 వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోవాలని తీర్మానం చేసిందని ఆయన వివరించారు. 

భాషా వ్యవహర్తలు లేకపోతే భాష కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ కవి, రచయిత డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు అన్నారు. దేశంలో క్రమేపీ అదృశ్యమయ్యే దశకు చేరుకుంటున్న భాషలు, మాండలికాల గురించి ఆయన వివరించారు. దైనందిన వ్యవహారాలలో మాతృభాషను తప్పనిసరి చేయాలని ఆయన సూచించారు. ఇతర భాషలను అవసరాల రీత్యా నేర్చుకున్నా మాతృభాషను మరువకూడదని డిప్యూటీ జోనల్ చీఫ్ సిహెచ్ రాజశేఖర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఒక వ్యక్తి తన మాతృభాషలో మాత్రమే తన భావాలను సరిగ్గా వ్యక్తీకరించగలడని ఆయన అభిప్రాయపడ్డారు. 

వివిధ భాషలతో పాటు మన స్వంత భాషను కూడా నేర్చుకుని తరువాత తరానికి నేర్పించాలని డిప్యూటీ జనరల్ మేనేజర్ గోవింద్ ప్రసాద్ వర్మ, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం.వి.ఎస్. సుధాకర్ కోరారు. భారతీయ భాషలకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఇస్తున్న ప్రాధాన్యతను అధికార భాష చీఫ్ మేనేజర్ గౌరి వివరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది.. హిందీ, తెలుగు, ఒడియా, బెంగాలీ మొదలయిన తమ తమ మాతృ భాషల్లో ప్రసంగించారు. చిన్న చిన్న పద్యాలు, సూక్తులను తమ మాతృభాషల్లో వివరించడం కార్యక్రమానికి వన్నె తెచ్చింది.

ఈ సందర్భంగా జోనల్ కార్యాలయ శిక్షణా కేంద్రం బరోడా అకాడమీలో నిర్వహించిన సెమినార్లో పాల్గొన్నవారితో పాటు క్విజ్, వ్యాసరచన,  సామెతలు తదితర అంశాల్లో నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కార్యాలయంలోని ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios