డాక్టర్ మండల స్వామి కవిత : పూర్ణ చక్రం
అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే - డే సందర్భంగా డాక్టర్ మండల స్వామి రాసిన కవిత ' పూర్ణ చక్రం ' ఇక్కడ చదవండి :
కాళ్ళతో తొక్కినా
కరెంటు మోటరెక్కినా
బాధలన్నీ మరిపించే
బతుకు మిషనే ఊపిరి
దారమే ఆధారంగా
కుట్టు పట్టాలపై సర్కస్ చేసి
ఇంటిల్లిపాది పూటెల్లదీసే
ఆకలి సైనికుడను
తాన్లను చీల్చే కత్తెరతో
పేలికలను కలిపే సూదులతో
స్వైరవిహారం చేస్తూనే
రోజు రాజీ పడుతుంటా
సమస్యల టాకాలను
గోర్లతో చీర్మాయించిన
వేలకొలది కత్తిరింపులతో
వేళ్ళకు కాయలు కాసినా
నరాలలో నారాజు నిండినా
నాగరికతతో సయ్యంటూ
కొలతలు పట్టుకు వ్రేలాడ్తా
తొలి ఇస్త్రీగీతకు ప్రతినిధిగా
చిక్కు ముడుతలెన్నో చేధిస్తా
తేనెటీగలై వాలే
ఫ్యాషన్ ప్రేమికులకు
నా దర్జీ ప్రియత్వంతో
దర్జా దర్పాన్ని బహుకరిస్తా
పనిముట్ల ఉసురు తీసేసిన
మోడ్రన్ మార్టుల మార్కెట్
పస్తులతో పల్టీ కొట్టిస్తుంటే
ఆసరా ఆయిల్ లేని జీర్ణచక్రం
పూర్ణ చక్రమై కదిలేదెట్లో...?