కవిత: వైవిధ్యభరితం...ఆదివాసుల జీవనం..!
నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గోపగాని రవీందర్ రాసిన కవిత ఇక్కడ చదవండి.
ఆకుపచ్చని సముద్రం వంటి
వన్నె తరగని వనంలో
జీవన సమర గీతాలు వాళ్ళు
విత్తనాల్ని వెదజల్లి
అపరిమితమైన దాన్యరాశులకు
ప్రాణం పోసే సృష్టికర్తలు వాళ్ళు
బతకడానికి అనుగుణమైన
బహు రకాలైన పనులు చేసే
విరామమెరుగని శ్రామికులు వాళ్ళు
గూడులపై పచ్చని పందిళ్ళతో
సహవాసం చేస్తారే తప్ప
భవనాలు కావాలని ఆశించరు వాళ్ళు
అత్యంత ఆప్తులైన వాటిని
ఊపిరితో పెనవేసుకుపోయిన చెట్లను
కూల్చుతుంటే ఉద్యమిస్తారు వాళ్ళు
సహజ సంపదలను
కొల్లగొట్టాలని ప్రయత్నించే వారిపై
ఉగ్రులై తరుముతుంటారు వాళ్ళు
భూమిని తమ గుప్పిట్లో పెట్టుకొని
పెత్తనాలు చేయాలనే
కోరికలు లేని వారు వాళ్ళు
సాగు కోసం కొంత నేల కావాలని
తరతరాలుగా పోరాడుతూన్న
అతి సామాన్యులు వాళ్ళు
కాలమేదైనా కానీ
అడవి తోనే సహవాసమని
తెలిసి మసలుకునేది వాళ్ళు
క్రూర మృగాలకు సైతం
జీవించే హక్కు ఉందని
గుర్తించిన సాహసవంతులు వాళ్ళు
ఏ ప్రాణికైన హాని తలపెట్టాలని
కలలో కూడా తలుచుకోని
నికార్సైన స్వేచ్ఛా ప్రియులు వాళ్ళు
కుట్రలు కుతంత్రాల వ్యూహాలతో
నవ నాగరికతతో మిడిసి పడుతున్న
మానవులకే ఆదర్శవంతులు వాళ్ళు
రేలా పాటల రాగాలతో
దండారి నృత్య గీతాలతో
అలరారుతున్న అడవి మల్లెలు వాళ్ళు
భిన్న సంస్కృతులు, విభిన్న భాషలతో
వైవిధ్యభరితమైన జీవితాలతో
విలసిల్లుతున్నారు వాళ్ళు
జల్ జంగల్ జమీన్ నినాదమై
జోడెన్ ఘాట్ లో నేలకొరిగిన
కొమరం భీమ్ వారసులు వాళ్ళు
భూమికోసం భుక్తి కోసం
ఇంద్రవెల్లిలో రక్త తర్పణ చేసిన
అమరుల పిడికిళ్ళు వాళ్ళు
నిర్బంధాల అణచివేతల
పీడనపై గళమెత్తిన
తుడుం మోతలు వాళ్ళు
వాళ్ళంటే ఎవరో కాదు
అడవి తల్లి వారసులైన ఆదివాసులు
మనందరికి మూలవాసులు
సమిష్టి జీవన విధానానికి
సజీవ సాక్ష్యం వాళ్ళు
మన చుట్టూ అల్లుకుపోయిన
ఇప్పపూల పరిమళాలు వాళ్ళు..!