Asianet News TeluguAsianet News Telugu

నల్లగొండ జిల్లా నాటక సాహిత్యం

రైతు బిడ్డ,పల్లెపడుచు,ఆదర్శ లోకాలు వంటి నాటకాలు నల్లగొండ జిల్లాలో ప్రభావితంగా తొలినాళ్లలో ప్రదర్శించబడ్డాయి. కాళిదాసు నాటకం మాళవికాగ్నిమిత్రం.దీనిని చిదిరెమఠం వీరభద్రయ్య శరభ విజయంగా తెనుగేంచినారు.

I chidanandam writes on Nalgonda district Theatre
Author
Hyderabad, First Published Aug 12, 2020, 3:08 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఐ.చిదానందం

నాటకాంతం హి సాహిత్యం కావ్యేషు నాటకం రమ్యం అని సాహిత్యంలో పెద్ద పీట వేశారు. తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమన దేశి కవితా పద్ధతికి చెందిన ఎన్నో కళారూపాలను పండితరాధ్య చరిత్ర ద్వారా తెలిపారు. మనకు లభించిన తొలి రూపకం క్రీడాభిరామం కానీ ఈ రూపక గ్రంధం అలభ్యం. తెలుగులో 1860 లో ప్రారంభమైనది ఆయితే 1900 వరకు కూడా మందకోడి గానే సాగింది. నల్లగొండ జిల్లా విషయం కు వస్తే ఈ జిల్లా నాటక సాహిత్యం ప్రారంభ దశలో పౌరాణిక నాటకాలు వచ్చినా ఆ తర్వాత జాతీయోద్యమ,తెలంగాణ ఉద్యమ,నిజాం రాజ్య పాలన వలన సాంఘిక నాటకాలు వెలువడినాయి.

*తొలినాటి నల్లగొండ నాటక సాహిత్యం*

రైతు బిడ్డ,పల్లెపడుచు,ఆదర్శ లోకాలు వంటి నాటకాలు నల్లగొండ జిల్లాలో ప్రభావితంగా తొలినాళ్లలో ప్రదర్శించబడ్డాయి. కాళిదాసు నాటకం మాళవికాగ్నిమిత్రం.దీనిని చిదిరెమఠం వీరభద్రయ్య శరభ విజయంగా తెనుగేంచినారు. అలాగే కాళిదాసు మరో రచన అభిజ్ఞాన శాకుంతలము శ్రీరామ కవచం కృష్ణయ్య, సంస్కృత రచనగ కాదంబరిని గురజాల గోపాలకృష్ణ శాస్త్రి మరి ని తెలుగులోకి నాటక రూపంలోకి తెచ్చారు. తమిళ వాఙ్మయ కథను ముడుంబ వెంకట నరసింహాచార్యులు గోదాకల్యాణం గా రచించారు అంగలూరు శ్రీ రంగాచార్యులు బాసుని ప్రతిమా నాటకాన్ని తెనుగేంచారు. శివ ధనుర్భంగం నాటకము అలువాల శేషయ్య శర్మ, సీతా కళ్యాణము ఏలె ఎల్లయ్య రచించడం జరిగింది.

*నాటికలు*

1969 లో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అనేక నాటకాలను రాసిన వారు శేషం రామానుజాచార్యులు.వీరు యామినీ పూర్ణ తిలకం అనే రేడియో నాటిక ను రాశారు. చరిత్ర శాసన పరిశోధకులు బి.ఎన్.శాస్త్రి గారు  1951-52 ప్రాంతాలలో నీరాజనం అనే  నాటికను రాసారు. బోయ జంగయ్య కష్టసుఖాలు అనే నాటకం రాశారు ఇది సందేశాత్మక నాటిక.ఇంకా చెరబండ రాజు గారు నాటికల ద్వారా బడుగు బతుకులను చిత్రీకరించారు. అలాగే పైడిమర్రి దుర్గారావు ఉత్తర గోగ్రహణం చిన్ననాటికను రచించారు.

*నల్లగొండ జిల్లా నాటకసాహిత్యం*

నల్గొండ జిల్లాలో ఎన్నో నాటక సంస్థలు వెలువడ్డాయి. తిరుమలగిరిలో కళా సమితి,నల్గొండ లో డ్రామా కంపెనీ, యాదగిరి లో కళా సమితి , హుజూర్నగర్లో శ్రీవాణి నృత్యగాన కళా నిలయం, మోత్తూరు లో  అభ్యుదయ కళా నిలయం, తాటిపాముల లో రెడ్ యూత్ కల్చరర్ అసోసియేషన్,సూర్యాపేటలో శారదా నాట్య కళామండలి, వెలుగు పల్లి లో క్రాంతి అసోసియేషన్ ,పోచంపల్లి లో కళాసాగర్, రామన్న పేట లో నృత్య కళాశాల, ఇలా ఎన్నో సంస్థలు నాటికలను నాటకాలను ప్రోత్సహించాయి. టి.పూర్ణచంద్రరావు గారు కళా సమితి స్థాపన చేసి కొంతకాలం నల్గొండలో ఈ సంస్థ నడిపారు.1958 లో  పెరిక రాజారత్నం విజ్ఞాన సమితి సైతం నాటక కళాకారులకు శిక్షణ ఇచ్చింది.

సురభి కుటుంబానికి చెందిన వారు శారదాదేవి, హనుమంతరావు దంపతులకు జన్మించిన వాడు సురభి వనారస రామమోహన్రావు (1939) వీరు నల్గొండ జిల్లా ఏదులూరు లో జన్మించారు. చిన్నతనం నుంచి సంగీతంలో ప్రవేశం ఉన్న రామమోహన రావు హార్మోనియం వాయించడము లో నిపుణుడు. ఇదే విద్య తోనే వీరు  అనేక నాటకాలకు సంగీత దర్శకత్వం వహించారు. అసంఖ్యాకమైన ప్రదర్శనలో పాల్గొన్న రామ్మోహన్రావు శ్రీకృష్ణతులాభారంలో శ్రీకృష్ణుడి,చింతామణి లో శ్రీహరి,బిల్వమంగళుడు,సతీ సావిత్రి లో అశ్వపతి, సత్యహరిచంద్ర లో విశ్వామిత్రుడు పాత్రలు వీరికి మక్కువ ఎక్కువ. సురభి సమాజం ప్రదర్శించిన బ్రహ్మంగారి చరిత్ర, లవకుశ మొదలైన నాటకాలు ఈయన సంగీత దర్శకత్వంలో ప్రదర్శించబడ్డాయి. హరి కథకుడిగా కూడా పేరొందిన రామ్మోహన్ రావు హరికథ కళా స్రష్ట,హరికథ రత్న బిరుదులను పొందారు.

నాటక ప్రదర్శనలకు అనువైన వాతావరణం లేని కాలంలో, ప్రోత్సాహం లభించని కాలంలో నాటకాలపై ఇష్టమున్న పెంచుకున్న రచయిత పెన్నా శేషావతారం(1932). వీరు నల్గొండ జిల్లా రామగిరి లో జన్మించారు.వృత్తి అధ్యాపకత్వం స్వీకరించి ప్రవృత్తి గా నాటకరంగం మార్చుకున్నారు.శ్రీకృష్ణ రాయభారం లో అర్జునుడు, శ్రీ రామాంజనేయ యుద్ధం లో భరతుడు, అంగదుడు, హరిశ్చంద్రుడు,పాత్రలు ధరించేవారు.దళిత కవిత్వం తో, నవలతో, దళితుల అణచివేతను అంటరానితనము, దళితులపై అమానుష విషయాలను ఖండిస్తూ రచనలు చేసిన రచయిత భూతము ముత్యాలు ఇతడు చదువు అనే నాటకం రాశారు.

సయ్యద్ అలీ, అజ్మతుల్లా కవులు యక్షగాన పద్ధతి లో దరువులు, కీర్తనలు ఉపయోగిస్తూ పాత్రోచిత భాషలో నాటకాలు రాశారు. సయ్యద్ రాసిన నాటకాలలో ముఖ్యమైనవి ప్రమీల,మోహిని, నవీన సత్య హరిచంద్ర,కాళీంది, సెరి సెనగండ్ల మహత్యం, జలంధరాసుర వధ మరియు అజ్మతుల్లా గారు ప్రమీల పరిణయం రాశారు.యాదగిరి నరసింహాచార్యులు మాలతీ వసంతం,ఉషాపరిణయం,కాళీంది కళ్యాణం నాటకాలు రాశారు.పద్యాలకు ప్రాముఖ్యత ఎక్కువ ఉండేది. అలాగే సోమంచి నరసింహశాస్త్రి నృసింహ కటాక్షం,శారదా కటాక్షం, కర్ణ హృదయం వంటి నాటకాలు రాశారు. ఇంకా రామడుగు శ్రీమన్నారాయణ వాసవి విలాసం, ముడుంబ వెంకట నరసింహాచార్యులు ధనుర్దసు,అంబడిపూడి వెంకటరత్నం లక్షణ, కౌమోదకి, చూడాల, బట్టరు  అనంతాచార్యులు -పద్మిని ప్రభాకరం వంటి నాటకాలు రాశారు.1953-58 మధ్య ఎక్కువ సాంఘిక నాటకాలు వచ్చాయి. గవ్వా మురహర రెడ్డి గుంటక పురాణం, అకెళ్ళ నరసింహ మూర్తి గెలుపు నీదే,అడుగు జాడలు,న.చ. రాఘవాచార్యులు-దేశం మారాలి, సరస్వతి భట్ల  కృష్ణమూర్తి వీర పత్ని వంటి నాటకాలను రాశారు.తడకమళ్ల రామచంద్రరావు (1952) నల్లగొండ జిల్లా మిర్యాలగూడ లో జన్మించారు. వీరు అనేక నాటకాలను ఏకపాత్రాభినయాలను ధరించారు. వీరికి కందుకూరి నాటక అవార్డు , అక్కినేని నాగేశ్వరరావు కళాపరిషత్ పురస్కారం పొందారు లభించింది.

1947 నుంచి 2002 వరకు సురభి శ్రీ త్యాగరాయ నాట్య కళా పరిషత్ మిర్యాలగూడ కు కార్యదర్శిగా వివిధ నాటక ప్రదర్శన చేసిన వారు పులి శేషయ్య (1948) వీరు నల్లగొండ జిల్లా మాధవరం లో జన్మించారు. వీరు  శ్రీకృష్ణరాయభారం, శ్రీరామాంజనేయ యుద్ధం,సీతాకల్యాణం సత్యహరిచంద్ర,గిరిజా కళ్యాణం వంటి నాటకాలలో ప్రధాన పాత్రలు వేసేవారు. దీనికి పలు సంస్థలు అభినయ కళా కౌముది, నాద విభూషణ వంటి అవార్డులను ఇచ్చి సత్కరించాయి.

*సూర్య పేట ప్రాంత నాటక సాహిత్యం*

సూర్యాపేటలో ఎన్నో నాటక సంస్థలు,క్లబ్బులు నాటిక,నాటిక పోటీలను నిర్వహించే వారు.  1963 లో ఎ.ఆర.కృష్ణ గారు సూర్యాపేటలో ఆంధ్రప్రదేశ్ నాటక సంఘం నాటక పోటీలు నిర్వహించడం బట్టి నాటకాలకు ఉన్న ఆదరణను ఎంతటిదో చెప్పవచ్చు.రంగస్థల నటులు డిప్యూటీ కలెక్టర్ వీర సూరి జానకి రామ శర్మ 1956 వీరు ఫిణీగిరి లో జన్మించారు. 1980లో నాటక రంగంలో అడుగుపెట్టిన శర్మ కృష్ణ తులాభారం,గయోపాఖ్యానం,శ్ర శ్రీ రామాంజనేయ యుద్ధం,సత్య హరిచంద్ర, చింతామణి, సతీసావిత్రి,నలదమయంతి వసంత రాజీవం వంటి నాటకాలలో నటించారు. శ్రీకృష్ణుడు,అనిరుద్దుడు, శివుడు పాత్రలకు శర్మ గారు పెట్టింది.

నాటక కర్త, నటన వసంత బిరుదు కలిగిన వారు చందాల కేశవదాసు(1876) . వీరు చిన్నా పెద్ద తేడా లేకుండా ఏ వేషమైనా సరే వేసి మెప్పించిన వారు . వీరు మైలవరం కంపెనీకి కృష్ణ తులాభారం, రాధాకృష్ణ నాటకాలను రాసి పెట్టే వారు. ఆంధ్ర దేశమును ఉర్రూతలూగించిన  "భలే మంచి  చౌక బేరం" అనే పాట వీరి కనకతార నాటకం లోనిదే. అంతేకాదు నాటక సమాజం వారు నాటక ఆరంభం కు ముందు పాడే "పరబ్రహ్మ  పరమేశ్వర" ప్రార్థన గీతం వీరు రాసినదే. వీరు స్వయంగా బలి బంధనం(1926) కనకతార (1925) నాటకాలను వ్రాసారు.టి.యల్ కాంతారావుగా  చలనచిత్రరంగంలో ప్రఖ్యాతులైన వారు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు వీరు కోదాడ తాలూకా గుడి బండ గ్రామానికి చెందిన వారు. వీరు మొదట సురభి నాటకాలలో పాత్రలు వేసేవారు. వీరికి నాటి కేంద్ర కార్మిక మంత్రి 1964లో నట ప్రపూర్ణ అనే బిరుదు ఇచ్చి సత్కరించారు.

హుజూర్నగర్ తాలుక రేపాల గ్రామంలో జన్మించినవారు కె. ఎల్ నరసింహారావు (1924). విద్యార్థిదశలోనే నాటకాలు వేసే వీరు రు వీరు గ్రామ వెలుగు నాట్యమండలిని స్థాపించి ప్రదర్శనలు ఇచ్చేవారు.  వీరి కలం నుండి దాదాపు పాతిక పైన నాటకాలు-నాటికలు వెలువడ్డాయి. వీటిలో ఆదర్శ లోకాలు,గెలుపు నీదే, అడుగుజాడలు, గుడిగంటలు వంటి నాటకాలు ఆదరణ పొందాయి.హుజూర్నగర్ లో కె.ఎల్.యన తో 1945 లో స్థాపించబడి ఆ తర్వాత రేపాలకు మార్చబడి జనతా కళామండలి గా పేరు మారిన ఇదే సంస్థ ఆ తర్వాత సూర్యాపేట కు మార్చబడింది. ఎస్.ఎల్.దాసు,కె.ఎల్ఎన్.రావు,తేరాల సూర్యనారాయణ శర్మ, డాక్టర్ శర్మ, ముడుంబ సీతా రామానుజాచార్యులు వీరంతా హుజూర్నగర్ గ్రామ వెలుగు ద్వారా నాటకాల్లో కి వచ్చిన వారే.

Follow Us:
Download App:
  • android
  • ios