Asianet News TeluguAsianet News Telugu

హారిక ఈప తెలుగు కథ: ప్రేమ బంధం

అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి , అక్కా తమ్ముళ్ళ అనురాగానికి ప్రతి రూపం రాఖీ పండుగ.  రేపు రాఖీ పండుగ సందర్భంగా సాఫ్ట్ వేర్ చెల్లెలు తన అన్నకు అక్షరాల హారతి ఇస్తూ ప్రేమ బంధాన్ని ఎలా తెలుపుతుందో ఈ కథలో చదవండి.

Harika Eepa Telugu short story in Telugu literature
Author
Hyderabad, First Published Aug 21, 2021, 1:24 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఆరోజు మార్చ్ 31, 2021వ సంవత్సరం...
మండపం అంతా మేళతాళాలతో,  బ్రాహ్మణుని  మంత్రాలతో, పిల్లల కేరింతలతో, బంధువుల ఆప్యాయతానురాగాల ముచ్చట్లతో, స్నేహితుల సరదాలతో నిండిపోయి ఉంది. అదే సమయంలో ప్రకృతి అనే నేను ఎందుకో దిగాలుగా అక్కడున్న వేదిక పైన నాకు ఎంతో ఇష్టమైన మా అన్నయ్య, వదినల వివాహం జరిపిస్తున్నాను. అన్నయ్య పెళ్లి జరుగుతున్నందుకు ఒక పక్క ఆనందంగా ఉన్నా కానీ మరోపక్క వెంటాడుతున్న ఏదో తెలియని బాధ నా మనసుని కమ్మేసింది.

నా మనసులో రైలు కంటే వేగంగా ఎన్నో ఆలోచనలు పరిగెడుతున్నాయి. ఆ ఆలోచనల్లోంచి పుట్టుకొస్తున్న బాధ నా కళ్ళను నీటితో నింపేస్తున్నాయి. "నేను ప్రేమించినంత గొప్పగా మా అన్నయ్యని కొత్తగా మా ఇంట్లోకి అడుగు పెడుతున్న మా వదిన చూసుకోగలదా? జీవితాంతం కష్టసుఖాల్లో మా అన్నయ్య వెంట నడవగలదా? చిన్నప్పటి నుంచి అన్నయ్య పెదవులపై చెక్కు చెదరకుండా ఉన్న ఆ చిరునవ్వుని ఎప్పటికీ అలాగే కాపాడగలదా?" ఇలా ఎన్నెన్నో ఆలోచనలు నా మనసుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆ ఆలోచనలతోనే కనురెప్ప వేయడం కూడా మరచి అన్నయ్యని చూస్తుండగా ఇన్ని సంవత్సరాల మా ప్రేమానురాగాలన్నీ కళ్ళ ముందు కదిలాయి.
                               ****

పద్నాలుగు సంవత్సరాల పాటూ పిల్లల కోసం మా అమ్మానాన్నలు నోచని నోము లేదు. చెయ్యని పూజ లేదు. మొక్కని దేవుడూ లేడు. డిసెంబర్ పదవ తేదీ, 1994 వ సంవత్సరం నాటికి బహుశా మా అమ్మానాన్నలు అందరి దేవుళ్ళను మొక్కడం పూర్తి అయిపోయి ఉండొచ్చు కాబోలు అందరూ కలసి ఒకేసారి దీవిస్తే పుట్టే బిడ్డ ఎలా ఉంటాడో మా అన్నయ్య కూడా అచ్చం అలాగే పూర్ణ చంద్రుడిలా పుట్టాడు. మా అన్నయ్య రాకతో అప్పటి వరకూ బోసిపోయిన ఇల్లంతా పండుగ వాతావరణం చోటు చేసుకుంది. మరో రెండు సంవత్సరాలకు నేను పుట్టాను. అక్కడితో మా అన్నయ్య గారాబానికి ఫుల్ స్టాప్ పడి  నా గారాబానికి హద్దులు లేకుండా పోయాయి.

అందరినీ నవ్వించడం కోసం నేను "14 సంవత్సరాల పాటు కావాలనే మా అన్నయ్యని నేనే పంపివ్వలేదు. నాకు బోర్ కొడుతుంది ఏమో అని అమ్మ పొట్టలోనే పెట్టేసుకున్నాను. కానీ అమ్మానాన్న బాధ పడటం చూసి పంపించేశాను. ఆ తర్వాత నేను కూడా అన్నయ్యని చూడకుండా ఉండలేక ఒక సంవత్సరం తర్వాత అమ్మ కడుపులోంచి బయటకు వచ్చేసాను" అని తమాషాగా చెప్పేదాన్ని.

అప్పుడు నేను ఐదవ తరగతి చదువుతుండగా మా అన్నయ్య ఆరవ తరగతిలో ఉన్నాడు. సాయంత్రం మేము ఇద్దరం కలిసి ట్యూషన్ కి వెళ్ళే వాళ్ళం. ట్యూషన్ ఐదు గంటలకు అయితే మేము నాలుగు గంటలకే వెళ్లి గంట సేపు ఆడుకుని అయిదు గంటలకు పుస్తకాలను పట్టేవాళ్ళం. ఒకరోజు అదే ట్యూషన్ లో ఉన్న ఒకబ్బాయి చిరంజీవి అభిమాని, మా అన్న ఏమో బాలయ్య అభిమాని. ఆ రోజు వాళ్ళిద్దరికీ మాటామాటా పెరిగి గొడవ రావడంతో మా అన్న చేతిలో ఉన్న బాలకృష్ణ పాటల పుస్తకాన్ని ఆ అబ్బాయి చించేసాడు. దాంతో మా అన్నకి కోపం వచ్చి ఏడుస్తూ ఆ అబ్బాయిని కొట్టడానికి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలీదు కానీ ఆ క్షణం మా అన్నయ్య కంటి నుంచి కన్నీరు జారేలోగా నా కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. ఇదే కాబోలు రక్త సంబంధం అంటే. ఇక మా అన్నయ్య గొడవ పూర్తి అయ్యేలోపు ఆ పుస్తకాన్ని ఎలాగైనా ముందులా చేసి ఇవ్వాలని ఒక్కొక్క పేపర్ ని వెతికి టేపుతో అతికించేసాను. కాసేపటికి వాళ్ళిద్దరి గొడవ పూర్తయిపోయి ఇద్దరూ ముందులా కలసిపోయినా, నేను మాత్రం ఇంకా ఏడుస్తూ ఆ పుస్తకాన్ని అతికించే పనిలోనే మునిగిపోయి ఉన్నాను. కాసేపటికి ఆ పుస్తకాన్ని నీట్ గా అతికించి మా అన్నయ్యకి ఇచ్చాను. మా అన్నయ్య సంతోషంగా ఆ పుస్తకాన్ని తీసుకుని వెళ్లి ఆ అబ్బాయికి చూపించి అతనికి ఇంకా కోపం వచ్చేలా ఆట పట్టించడం మొదలు పెట్టాడు. అప్పటికి కానీ నా మనసు కుదుట పడలేదు.

మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల, ఆయన ఉద్యోగరీత్యా మేము చాలా ఊర్లు మారాల్సి వచ్చేది. మా నాన్నకి మంగళవారం సెలవు కావడంతో ఆయన ప్రతి మంగళవారం ఇంటికి వచ్చేవారు. తిరిగి వెళ్ళేటప్పుడు మా ఇద్దరికీ చెరొక ఐదు రూపాయలు ఇచ్చేవారు. నేను తెలివిగా ఆ డబ్బులు హుండీలో వేసేసి‌, మా అన్నయ్య దగ్గరకు వెళ్లి తనని రెచ్చగొట్టి ఇంటి వెనుక ఉన్న అంగడికి తీసుకుని వెళ్ళేదాన్ని. కానీ అక్కడికి వెళ్ళే దారి మధ్యలోనే నా చిట్టి బుర్రతో ఒక మాస్టర్ ప్లాన్ వేసి తనతో "అన్నయ్యా.. ఈ ఐదు రూపాయల్లో మూడు రూపాయలు ఎక్కువ కాబట్టి మూడు రూపాయలు నువ్వు తీసుకో, మిగిలిన రెండు రూపాయలను నేను తీసుకుంటా" అని చెప్పేదాన్ని. అది విన్న వెంటనే మా అన్నయ్య నవ్వుతూ సరే అని చెప్పి నాకు రెండు రూపాయలు ఇచ్చేవాడు. అంత చిన్న వయసులోనే నా తెలివిని అర్థం చేసుకుని కోపగించుకోకుండా, నవ్వుతూ అన్ని విషయాల్లో నా వెంట ఉండే మా అన్నను చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

                              ***

ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను‌, ఒకరికి ఒకరు ఇవ్వడంలో ఉన్న ప్రేమను తలచుకుంటూ, ఇప్పుడు అన్నయ్య బాధ్యతలు అన్నీ వేరే వాళ్ళకి అప్పగించాలా అని నాలో నేనే మథన పడుతున్న సమయంలో హఠాత్తుగా ఎవరో పిలిచినట్టు అనిపించింది. దాంతో వెనక్కి తిరిగి చూడగా "తాళిబొట్టు ఎక్కడ పెట్టావు ప్రకృతీ?" అంటూ పెద్దమ్మ నన్ను పట్టుకుని అడుగుతూ కనిపించింది. వెంటనే నేను ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి "తీసుకొస్తాను పెద్దమ్మా" అంటూ అక్కడ నుంచి పరిగెత్తాను. ఆ తర్వాత దేవుడి గదిలోకి వెళ్లి ఎంతో అపురూపంగా దాచిపెట్టిన మా అమ్మ తాళిబొట్టుని నా చేతిలోకి తీసుకుని తనివితీరా ముద్దాడి, కన్నీటిని తుడుచుకుని వేదిక పైకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తాళిని అన్నయ్య చేతికి అందించి వదిన జడను పైకి ఎత్తి పట్టుకున్నాను. ఆ తర్వాత అన్నయ్య వదిన మెడలో తాళి కట్టాక నా వైపు చూసి, చెప్పకపోయినా అప్పటికే వాడిపోయిన నా కళ్ళను చూసి అర్థం చేసుకుని ఆప్యాయంగా ఏం కాదు, అంతా మంచే జరుగుతుంది అన్నట్లుగా ఒక చిరునవ్వు నవ్వాడు. అక్కడితో ఒక్క నా సంతోషానికి తప్ప, మిగిలిన నా ఊహలకు, ఆలోచనలకు శుభం పలికి త్వరత్వరగా మిగిలిన పెళ్లి పనులను పూర్తి చేసాను. పెళ్లి తతంగమంతా పూర్తయ్యాక బంధువులంతా ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు.

                                ***

సుమారు ఐదు నెలలు గడిచిన తర్వాత....

బెడ్ మీద ఉన్న నా ఫోన్ మోగడంతో లేచి చూడగా మా అన్నయ్య రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతూ మెసేజ్ చేసాడు. ఇంతలో వదిన నేను లేవడం గమనించి నా గదిలోకి కాఫీ తీసుకుని వచ్చింది. నేను కాఫీ తాగుతుండగా తన చీరను నా చేతికి అందిస్తూ "స్నానం చేసి ఈ చీర కట్టుకుని రా ప్రకృతీ! మీ అన్నయ్యకి రాఖీ కడుదువు" అని నవ్వుతూ బయటకు వెళ్ళిపోయింది.

నేను స్నానం చేసి అన్నయ్య గదిలోకి వెళ్తుండగా మా అన్నయ్య, వదిన ఇద్దరు నా పేరు పలుకుతూ మాట్లాడడం విని ఆగిపోయాను. అన్నయ్య వదినతో "బుజ్జీ.. మన ప్రకృతి ఏ క్షణంలోనూ కంటతడి పెట్టకూడదు. మనమిద్దరం తనని అంత బాగా చూసుకోవాలి. నీ సొంత చెల్లెలిలా తనతో మెలుగుతానని నాకు మాటివ్వు" అని అడిగే లోపే వదిన అందుకుని "ప్రకృతిని చెల్లెలిలా కాకుండా నా కూతురుగా నేను ఎప్పుడో అంగీకరించాను. తప్పు చేస్తే తల్లిలా దండిస్తాను. మీ అంత ప్రేమగా కంటికి రెప్పలా చూసుకుంటాను. మీతో ఏడు అడుగులు వేసినప్పటి నుంచి మీ ఇష్టాలే నా ఇష్టాలు అయిపోయాయి. మీరు నా గురించి భయపడకండి" అని అనగానే మా అన్నయ్య సంతోషంతో వదినని కౌగిలించుకున్నాడు. వాళ్లు నా మీద చూపే ప్రేమ తట్టుకోలేక నాకు గొంతులో ఊపిరి బిగబట్టినట్టు అయిపోయింది. వెంటనే నేను తిరిగి నా గదిలోకి వెళ్లి ఆనందభాష్పాలతో మనసులో "ఇన్నాళ్లు మా వదిన అన్నయ్యని ఎలా చూసుకుంటుందో అనే భయంతో ఉన్నాను. కానీ ఇప్పుడు అన్నయ్యని ప్రేమగా చూసుకోవడం కాకుండా నాకు తల్లి ప్రేమను కూడా పంచుతోంది. మా అన్నయ్య, వదినల రుణం నేను ఎప్పటికి తీర్చుకోగలను" అని అనుకుంటూ ఆనందంతో ఏడుస్తుండగా ఇంతలో వదిన పిలుపు వినిపించింది. వెంటనే నేను కళ్ళు తుడుచుకుని నవ్వుతూ అన్నయ్య దగ్గరికి వెళ్లి కౌగిలించుకొని రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశాను. వదిన దేవుడి గది నుండి రాఖీ తీసుకుని వచ్చి నా చేతికి అందించింది. తర్వాత అన్నయ్య పెదవులపై చిరునవ్వు ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకుంటూ రక్షణగా రాఖీ కట్టి అన్నయ్య ఆశీస్సులు తీసుకున్నాను.

ప్రతి సంవత్సరం అన్నయ్యకి రక్షాబంధన్ రోజున రాఖీ కడుతూ బహుమతి ఇవ్వడం అలవాటు. ఈ సంవత్సరం కూడా అన్నయ్యకి రాఖీ కట్టాక ఏ బహుమతి ఇవ్వగలను అని ఆలోచిస్తుండగా ఇలా అన్నయ్య మీద నాకు ఉన్న ప్రేమని అక్షరాల రూపంలో ప్రపంచం అందరికీ వినపడేలా తెలియజేయాలని ఆలోచనతో ఇవాళ మీ ముందున్న మా అన్నయ్య చిట్టి చెల్లెలు - ప్రకృతి. 

Follow Us:
Download App:
  • android
  • ios