గుడిపల్లి నిరంజన్ కవిత : సైన్స్ ఋతువు
సైన్సు పిలుపును వినగలిగే వారే నిజమైన దేశభక్తులు అంటూ నాగర్ కర్నూల్ నుండి గుడిపల్లి నిరంజన్ రాసిన కవిత ' సైన్స్ ఋతువు ' ఇక్కడ చదవండి :
దేశం చంద్రునిలా తెల్లగా నవ్వుతుంది
మనిషి శాస్త్రీయ యోగిలా మారుతున్నాడు
ఇప్పుడు దేశంలో సైన్సు ఋతువు అలుముకున్నది
కల ఎంత రగిలితే
స్వప్నం అంత వికసిస్తున్నది
కసి జ్వలిస్తేనే
కోరికలు ఫలిస్తాయి
ఎక్కడినుండి ఎక్కడిదాకా ప్రయాణం
చంద్రుడి ఆవలి అంచుకు చంద్రయాన్
శాస్త్రియ పల్లకి ఎక్కిపోతుంది
సైన్సు పిలుపును వినగలిగే వారే నిజమైన దేశభక్తులు
శాస్త్రియ విజయమే
మానవాళి నిజమైన ప్రగతి ప్రయాణం
దూరమెప్పుడూ దూరమే అనేది
పాతకాలపు మాట
దూరం ఎప్పుడూ దగ్గరే నేటి కాలపు సైన్స్ పూదోట
చంద్రుడు సంతోషానికి ప్రతీక
అక్కడికి చేరాలనేది
తరతరాల తారాజుల కోరిక..
చేరాల్సిన చోటికి చేరాం
నడవాల్సిన చోటికి నడిచాo
ఇప్పుడు విజయ గర్వంతో ప్రతి భారతీయుడి గుండె
చందమామై తెల్లగా నవ్వుతుంది
జయహో ఇండియా