కంఠం నుండి చింత నిప్పులు వెదజల్లిన అలావుగుండం అంటూ నాగర్ కర్నూల్  నుండి గుడిపల్లి నిరంజన్  రాసిన కవిత ' పాట పొద్దు గుంకింది...! ' ఇక్కడ చదవండి :

ఆయన పాట పాడితే
చలిగాలి పిల్ల తెమ్మెరలకు
వేడి సెగలు పుడుతాయి!

అడవి పొదల పైన పాపిట తీసి నిత్యము గొంతెత్తి 
దోపిడీని కరిగించిన పాటతను

చందమామను తలదన్నే నవ్వులతో ....
పాటల నురుగులతో...
తప్పెట కొట్టినప్పుడల్లా
ఆయన గుండె ధన ధన విముక్తికై దరువులేస్తుంది!
అయన కాళ్ళ గజ్జలను భూమాత కండ్లకద్దుకున్నది కత్తిదిప్పినట్లుగా గొంగడి తిప్పి
రాజ్యాo మత్తువదిలిస్తుంటాడు

పాట అతని కత్తి, డాలు
'ప్రజల విముక్తే' అతని కళ

 ఆయన ఈ నేల విత్తనం
 ప్రజల పాటల సత్తువ
 సమాజ మరమ్మత్తుకై సాగి
 సమతా స్థాపనకై దుమికినాడు
 గొంతెత్తి 'జన'పద రాగాలు పాడిండoటే 
ప్రజలందరూ పక్షుల గుంపులవుతారు

పంట దుక్కుల్లో పాటలు పారించి
నింగి సూర్యకాంతిని వెలుగుగా మార్చినాడు
అయన దుమ్ము కాళ్ళ
మనుషుల కలల దీపం
కంఠం నుండి చింత నిప్పులు వెదజల్లిన అలావుగుండం

చీకటింట పాటల దీపాలు ముట్టించి
ప్రజలను చైతన్యం చేస్తుంటే రోషానికొచ్చిన రాజ్యానికి ఎదరములు చూపి
తూటాను దాచుకున్న
'చండ శివుడు'

 పాటల యుద్ధ నౌక
 ప్రజలను ఒంటరి చేసి వెళ్లిపోయింది
తెలంగాణలో పాట పొద్దుగుంకింది!

పాటా..!
గుండె దిట్టవు చేసుకొని ధైర్యంగా ఉండు
వీరుడు మళ్ళీ 'పొడుస్తున్న పొద్దు' మీద పిడికిలై లేస్తాడు!