గోపగాని రవీందర్ కవిత : సమర యోధునికి జేజేలు..!
వినూత్న దినోత్సవాలకు సిద్ధమౌతూనే వీడని స్మృతులను మననం చేసుకోవాలి అంటూ లక్సెట్టిపేట నుండి గోపగాని రవీందర్ రాసిన కవిత "సమర యోధునికి జేజేలు..!" ఇక్కడ చదవండి.
పాత లెక్కలన్నీ కొట్టేయాలి
కొత్త లెక్కలకు సాన పట్టాలి
ఎన్నెన్నో మాటల్ని రాసుకోవాలి
ఎందరెందరినో గుర్తు చేసుకోవాలి
పాత పద్దు కాగితాలను చింపేయాలి
అనుబంధపు సారాన్ని మదింపు చేయాలి..!
జీవన గమనంలో పరుగెత్తుతున్నాం
కాస్తనైన విశ్రమించండిప్పుడు
తిరిగి నూతనంగా మొలకెత్తడానికి
భూమినంతా జల్లెడ పట్టాలి
మనకొక అనువైన ప్రదేశం కోసం
అహర్నిశలు శ్రమిస్తూనే ఉండాలి
మనల్ని ప్రేమించే మనుషుల కోసం..!
ఆలోచనలు రలిగించే రాతలే రాయాలి
ఆచరణకు అడుగులేసే వాక్యాలే కావాలి
కాంక్షను జ్వలించే ప్రసంగాలే కావాలి
సమన్వయపరిచే పాదులే తవ్వాలి
వారోత్సవాలకు, మాసోత్సవాలకు
వినూత్న దినోత్సవాలకు సిద్ధమౌతూనే
వీడని స్మృతులను మననం చేసుకోవాలి...!
మనల్ని వదిలి పోయారెందరో
మనల్ని అక్కున చేర్చుకున్నారెందరో
విష వలయాల నుండి రక్షించారెందరో
హృదయాన్ని కలవరపెట్టిన దుఃఖాలెన్నో
మనసును సంతోషపెట్టిన అనుభవాలెన్నో
పోటీపడుతూనే అనుక్షణం పలకరిస్తాయెన్నో
అన్నింటినీ గుండె గూటిలో పదిలపర్చుకోవాలి..!
మర్పులకై ఉత్తేజాన్నిచ్చే ఎర్ర పొద్దులా
విషాదాలతో ఉద్వేగాన్నిచ్చే నల్లపొద్దులా
ఉజ్జ్వలమైన భవిష్యత్తునిచ్చే నీలం పొద్దులా
దిగులు మేఘాల్లో రేకెత్తించ్చే ఆశల పొద్దులా
అడవిలో విచ్చుకుంటున్న పచ్చని పొద్దులా
తూర్పు కొండ నుండి కొత్త పొద్దులా
కరచాలనం చేస్తున్నా సమరయోధునికి
ముక్తకంఠంతో జేజేలు పలుకుదాం...!