గోపగాని రవీందర్ కవిత: మాతృభాషకు జేజేలు..!
నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా గోపగాని రవీందర్ రాసిన కవిత "మాతృభాషకు జేజేలు..!" ఇక్కడ చదవండి
రమణీయ కమనీయమైన
మాటలతో ఆకట్టుకునేది
పదాల సరిగమలతో
స్నేహ మాధుర్యాన్ని పంచేది
ఆనందపు ఉషస్సులను అందించే
మాతృ భాషకు జేజేలు..!
భావానికి భావానికి మధ్యన
మనిషికి మనిషికి మధ్యన
మనసుకు మనసుకు మధ్యన
ప్రాంతానికి ప్రాంతానికి మధ్యన
కట్టుదిట్టమైన వారధిగా నిలిచిన
మాతృభాషకు జేజేలు..!
మనసంతా పచ్చని పందిరిలా
హృదయమంతా విచ్చుకున్న మందారంలా
ఆకాశమంతా పరుచుకున్న మబ్బుల్లా
అడవంతా వికసించిన పువ్వుల్లా
అల్లుకుపోయే వసంత గానమైన
మాతృభాషకు జేజేలు..!
ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం
ఆత్మవిశ్వాసానికి కరదీపిక
అలుపెరుగని పోరాటానికి ఊపిరి
నవరసాల జల్లు కురిసే అక్షరవనం
సాహిత్య సంపదలతో ప్రవహించే
జీవద్భాషైన మాతృభాషకు జేజేలు..!