సారాంశం

కమ్మని మాటల వలల్లో ఇరుక్కోకుండా సంయమనం పాటించాలి అంటూ గోపగాని రవీందర్ రాసిన కవిత ' జ్వలన గీతంలా విలసిల్లాలి..! '  ఇక్కడ చదవండి.

అది నీవు రాసిన వాక్యామే కావచ్చు 
అట్లాగే ఎప్పుడూ ఉండిపోదు 
వాక్యానికి సరికొత్త అర్ధాల రక్తాన్నేక్కిస్తూ
సారవంతమైన జవసత్వాలతో
అక్షరాలను మొలకెత్తించడానికి
నిత్య కృషీవలుడిలా సాధన చేయాలి..!

జీవనానుభవాలు కూడా అంతే 
గుణపాఠాలతో రాటుతేలడాన్ని 
నేర్చుకుంటూనే అడుగులు వేయాలి
పదేపదే అవమానాలకు గురవుతున్న
తిప్పి కొట్టే విలువిధ్యనే అభ్యసించాలి
పదేపదే ఎదుర్కొంటున్న వివక్షతలపై
పదును దేలిన కృపాణాన్నే సంధించాలి 
నీలో నీవే కుమిలిపోతూ మిగిలిపోకుండా 
దేహ వాక్యాన్ని దృఢంగా నిర్మించాలి..!

మాయా ప్రపంచపు మత్తులో 
చిక్కుకోకుండా నేర్పును ప్రదర్శించాలి
కమ్మని మాటల వలల్లో 
ఇరుక్కోకుండా సంయమనం పాటించాలి
సమర్థవంతమైన సామర్ధ్యాన్ని
నిర్మించుకుంటూ కార్యసాధకుడిలా సాగాలి 
ముసురుకున్న స్వార్థపు పొరలను
చీల్చుకుంటూ ధీరోదాత్తుడిలా నిడవాలి
జడత్వాన్ని పాతర వేస్తూ 
జ్వలన గీతంలా విలసిల్లాలి..!