వర్తమానపు దీనస్థితికి నిలువుటద్దాలు - అగమ్య గోచరమైన మహా ప్రణాళికలు..! అంటూ గోపగాని రవీందర్ రాసిన కవిత ' నిరంతర తండ్లాట..! ' ఇక్కడ చదవండి : 


లోలోతుల్లోకి తవ్వుతూనే 
ఘనమైన వైభవాన్ని వివరిస్తారు
వాగ్దానాల అమలును ప్రస్తావిస్తారు
స్వర్ణమయమైన తరాల్ని ఆరాధిస్తారు
ఆధిపత్య యుద్ధాల్లో మానని గాయాలను 
అహర్నిశలు వినిపిస్తుంటారు 
సామాజిక విప్లవాల విజయ గీతికలను 
స్మరించుకునే వారసులకై వెతుకుతుంటారు 
అవధుల్లేని అధికార దర్పంతో 
సామాన్యులంతా విలవిల్లాడుతుంటారు..!

మాటల కుప్పలు పెరుగుతుంటాయి
ఇచ్చిన హామీలు కరిగిపోతుంటాయి
కాలమెప్పుడు పరీక్షిస్తూనే ఉంటుంది
ఇప్పటికిప్పుడే అనుకున్నది నెరవేరితె చాలు
భవిష్యత్ బంగారం గురించి చింతలెందుకు?
నేటి తరపు దుస్థితికి బాధ్యులెవరు?
నిస్సారపు యువతరానికి ఆశాజ్యోతెవరు?
ప్రశ్నల మాటల ఈటెలు విసురుతుంటారు
వర్తమానపు దీనస్థితికి నిలువుటద్దాలు
అగమ్య గోచరమైన మహా ప్రణాళికలు..! 

అన్ని మనకెప్పుడు ముఖ్యమైనవే 
విభిన్న మార్గాల్లో అన్వేషించిన కూడా
విస్మరించలేని వాస్తవాలనేకం 
సుదీర్ఘ మానవ ప్రయాణంలో
ఊహల కందని పద్మవ్యూహాలెన్నో 
మనందరినీ అతలాకుతలం చేస్తున్నవి 
ఆశలను రేకెత్తించిన వాటిని నెరవేర్చడమే 
మనిషితనానికి అసలైన చిరునామా
బహు రూపాల్లో వ్యక్తమవుతున్నది
మనుషుల నిరంతర తండ్లాట..!