హత్తుకుంటున్న ప్రతి ప్రేమను, దుఃఖాన్ని గొంతెత్తి పాడాలనిపిస్తుంది అంటూ గోపగాని రవీందర్ రాసిన కవిత ' అక్షరాల ఉత్తేజం..!' ఇక్కడ చదవండి :
ఒక రోజు గడిచిపోయింది
ఇదొక పెద్ద విషయం కాకపోవచ్చు
విపులంగా చెప్పుకోవడానికి
అనువైన విశేషణాలు లేకపోవచ్చు
క్షణక్షణాల్లోని అనుభూతి
అపరిమితమైన ఆశల కాంతి రేఖ..!
Add Asianetnews Telugu as a Preferred Source

మనసు నిండా
చిందరవందరైన ఆలోచనలను
దారంతో పూలమాలను అలినట్లుగా
ఒక సుమధురమైన విధానం కోసం ఆరాటం
ఏదీ మన మాట విన్నట్లుగా ఉండదు
మన దరికి రానట్లుగానే ఉంటుంది
దొర్లుకుంటు పోవాల్సిందే మునుముందుకు..!
పలకరిస్తున్న ప్రతి దృశ్యాన్ని
అక్షరమయం చేయడమొక అలవాటు
హత్తుకుంటున్న ప్రతి ప్రేమను, దుఃఖాన్ని
గొంతెత్తి పాడాలనిపిస్తుంది
దీన గాథలకు రెక్కలు తొడగాలనిపిస్తుంది
అనునిత్యం అక్షరాల ఉత్తేజం
తనువంతా రక్తంలా ప్రవహిస్తూనే ఉంటుంది..!
