Asianet News TeluguAsianet News Telugu

గాజుల శ్రీధర్ కవిత : యుద్ధం యుద్ధం

మనుషుల కోసం ఆత్మగౌరవ యుద్ధం అంటూ గద్దర్ స్మృతిలో గాజుల శ్రీధర్ రాసిన కవిత ' యుద్ధం యుద్ధం ' ఇక్కడ చదవండి : 

Gajula Sridhar's poem on gaddar - bsb - opk
Author
First Published Aug 10, 2023, 12:40 PM IST

యుద్ధం యుద్ధం
గద్దర్ అంటే యుద్ధం
మాటు వేసిన తూటలతో
పాట చేసిన యుద్ధం
గద్దర్ అంటే యుద్ధం

దుక్కిని దున్నిన కూలిది యుద్ధం
మొక్కను నాటిన రైతుది యుద్ధం
ముసిరిన అమాస చీకటిపై 
వెన్నెల చేసే యుద్ధం

ఇంద్రవెల్లిలో గోండు గూడెం
తుడుం మోత యుద్ధం
కారంచేడు దళిత వీరుల
నెత్తుటి ధార యుద్ధం
అన్నింటా సగం మేమని
అక్కలు చేసే హక్కుల యుద్ధం
యుద్ధం  యుద్ధం
గద్దర్ అంటే యుద్ధం

ఈ దేశం మాదని నేల మాదని
అనాది నుండి మూలవాసుల  యుద్ధం
అడవి కోసమని ఆదివాసుల  
అలుపెరుగని యుద్ధం
మనిషిని మనిషిగా చూడని
మూఢత్వంపై యుద్ధం
మనుషుల కోసం ఆత్మగౌరవ యుద్ధం

ఆధిపత్య పీడనపైన   తిరుగుబాటు యుద్ధం 
వనరుల దోపిడీ కోటలు  కూల్చే యుద్ధం 
ఉన్మాదపు హింసల చరితను మార్చే యుద్ధం
మానవత్వపు బంధాలను కూర్చే యుద్ధం
యుద్ధం యుద్ధం
గద్దర్ అంటే యుద్ధం

చెమట మాదని శ్రమ మాదేనని 
సంపద పైన హక్కులు మావని యుద్ధం
నెత్తుటి  తర్పణం ఎంతైనా
ఆ పొద్దును ముద్దాడే దాకా ఆగదు ఈ యుద్ధం

Follow Us:
Download App:
  • android
  • ios