పేగు మాడుతున్న కొద్ది మగ్గం మీది మెతుకు రాగం అల్లుతూనే ఉంటుంది అంటూ ఆకలి ముందు ఓడిపోతున్న కులవృత్తుల విషాదాన్ని గజ్జెల రామకృష్ణ కవిత " మేలుగంధం " లో చదవండి:

పగలయితే ఆకలి 
ఏడుగుర్రాల రథమెక్కి పరుగు పరుగున వొస్తుంది 
వొచ్చింది వొచ్చినట్టు 
పేగుల కుప్పలో నిప్పయి రాజుకుంటుంది. 

పేగు మాడుతున్న కొద్ది 
మగ్గం మీది మెతుకు రాగం అల్లుతూనే ఉంటుంది 
పాకోల్లు తొక్కీ తొక్కీ
ప్రాణం
మగ్గం గుంత పాలవుతుంది. 

ఎంత నేసినా 
బకాసురుడి అన్నంబండి కట్టినట్టు 
కడుపు నిండు అదృష్ట రేఖ మాయమవుతుంది. 

పగలు నిస్సారం 
చెరుకు పిప్పి జీవితం 

రాత్రి 
చలువ పందిరి 
కడుపంత దావానలం చల్లబడు 
గ్లాసెడు మంచినీళ్ళ ఫైరింజన్ 

కంటి గలుమల 
మండుతున్న ఎడిసన్ బుగ్గదీపం కాపలా పెట్టి
దారానికి కలలు జోడించి 
బ్రతుకు పద్యం పేనుకునే మేలుగంధం 

పగలు కంటే రాత్రే నయ్యం 
ఒక్క పూట మెతుకు మిగిలే
ఊపిరి పాటకు పల్లవి కడుతుంది.