ఆరుద్ర సతీమణి, ప్రముఖ రచయిత్రి కె. రామలక్ష్మి కన్నుమూత
సుప్రసిద్ధ రచయిత్రి, సినీ రచయిత ఆరుద్ర సతీమణి కె.రామలక్ష్మీ కన్నుమూశారు. ఆమె మరణం పట్ల పలువురు రచయితలు, ప్రముఖులు సంతాపం తెలిపారు.
సుప్రసిద్ధ రచయిత్రి, సినీ రచయిత ఆరుద్ర సతీమణి కె.రామలక్ష్మీ కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్థాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ మలక్‌పేట్‌లోని తన నివాసంలో శుక్రవారం కన్నుమూశారు. 1930 డిసెంబర్ 31న కోటనందూరులో జన్మించిన రామలక్ష్మీ.. మద్రాస్ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టభద్రురాలయ్యారు. 1951 నుంచి రచనలు సాగిస్తున్నారు. తెలుగు స్వతంత్రలో ఇంగ్లీష్ విభాగానికి ఉప సంపాదకులుగా పలు అనువాదాలు చేశారు రామలక్ష్మీ.
విడదీసే రైలుబళ్ళు , అవతలిగట్టు, మెరుపుతీగె, తొణికిన స్వర్గం, మానని గాయం, అణిముత్యం, పెళ్ళి, ప్రేమించు ప్రేమకై, ఆడది, ఆశకు సంకెళ్ళు, కరుణ కథ, లవంగి, ఆంధ్ర నాయకుడు, పండరంగని ప్రతిజ్ఞ , నీదే నాహృదయం, అద్దం, ఒక జీవికి స్వేచ్ఛ వంటి కథాసంకలనాలను రామలక్ష్మీ రచించారు. తెలుగు సాహిత్య రంగానికి చేసిన సేవలకు గాను ఆమెకు గృహలక్ష్మి, స్వర్ణకంకణం సహా పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి.
సాహిత్య సేవతో పాటు అనేక స్త్రీ సంక్షేమ సంస్థలలో పనిచేసి.. మహిళల శ్రేయస్సు కోసం రామలక్ష్మీ పాటుపడ్డారు. 1954లో సినీ రచయిత, కవి ఆరుద్రతో రామలక్ష్మీకి వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఈ రోజు సాయంత్రమే రామలక్ష్మీ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మరణం పట్ల పలువురు రచయితలు, ప్రముఖులు సంతాపం తెలిపారు.