స్మృతి కవిత : గన్ను కృష్ణ మూర్తియే - పెన్ను కృష్ణమూర్తి !

ఈ మధ్యే కీర్తి శేషులైన గన్ను కృష్ణమూర్తి  గురించి వారి మిత్రులు వి పి చందన రావు , కందాళై రాఘవాచార్య నిజామాబాద్ నుండి జంటగా రాసిన స్మృతి కవిత "గన్ను కృష్ణమూర్తియే - పెన్ను కృష్ణమూర్తి ! " ఇక్కడ చదవండి :

Elegy on Late Poet Gannu Krishnamurthy

రెప్ప వేయని కన్నుగా కాలాన్ని చూసి 
తన కలాన్నే గన్నుగా చేసి 
కవితా క్షిపణుల వదిలిన నిరంతర నిష్ట కవి
"అడవి పూలు" పూయించి
"కవితా కాళింది" ని ప్రవహింప జేసి
తన "అంతరంగం" సమాజమని ధ్వనింపజేసి 
"కృష్ణ వేదం" అంటూ వేదానికి నూతన భాష్యం చెప్పి 
"మట్టి వెళ్లనీదు" అని మనిషికి మట్టికి 
తెగని అనుబంధం వాచకం చేసి 
"శ్రీ కృష్ణ రమ్య రామాయణం " నవరీతిగా వాల్మీకి వ్యాసంగం చేసి 
"మహా సంకల్పం" లోక దర్శనంగా గలమెత్తి 
ఎన్నెన్నో విమర్శన గ్రంథాలను లోకస్థం చేసి 
అనువాదాలను అనునాదాలుగా ప్రతిధ్వనింపజేసి 
చెప్పాపెట్టకుండా అలుపెరుగని బాటసారిగా 
ఏ లోకాలకో ఇంకా కవిత్వాన్ని వెతుక్కుంటూ 
దాహంగా మనిషిలోని దైవత్వం కోసం
గన్ను కృష్ణమూర్తి రోడ్డు దాటకుండానే 
మహా ప్రస్థానం వైపు వెళ్లిపోయారు !
"కీర్తి" పురస్కారానికి ఎంపికై 
ప్రధానోత్సవానికి లేకుండానే ఖాళీ జోలెతో  తేలికై
అన్ని గ్రంథాలను మనకే మూటగట్టి 
మన తల మీద బరువు ఎత్తేసి 
విలాసంగా ఖాళీ చేతులను ఊపుకుంటూ
"అభిలేఖిని " లేకుండానే 
మనకు దూరంగా వేదగానం చేసుకుంటూ 
పాల పుంతలు దాటుకుంటూ 
ఇగిరిపోని స్నేహ గంధం మాకు అద్ది
గన్ను కృష్ణమూర్తి గగన తలమైనాడు !
మా మనస్సులో అక్షరం పోగు తెగని ఆశు కవితైనాడు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios